జొమాటో ఫుడ్ డెలవరీ బాయ్ ఇప్పుడు నెట్టింట సెలబ్రెటీగా మారాడు. అది కూడా తన సొంత టాలెంట్ తో. సింగర్ గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో కుటుంబాన్ని పోషించడానికి ఫుడ్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఆ వృత్తి ద్వారా ఇప్పుడు తనలో ఉన్న టాలెంట్ ని దేశానికి పరిచయం చేశాడు. ఇప్పుడు అతని పాటను నెటిజన్లు ఫిదా అయిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... తాజాగా గౌహతీకి చెందిన అనిర్భన్‌ చక్రవర్తి అనే వ్యక్తి జొమాటోలో ఆహారాన్ని ఆర్డర్‌ చేశారు. తనకి ఆహారం సరఫరా చేసే ప్రంజిత్‌ హలోయి అనే వ్యక్తి ప్రొఫైల్‌ను చక్రవర్తి పరిశీలించారు. అందులో సింగర్‌ కావాలన్న ప్రంజిత్‌ ఆశయాన్ని గమనించారు. 

అనంతరం ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ప్రంజిత్‌ను చక్రవర్తి ఒక పాట పాడాల్సిందిగా కోరారు. దీంతో అతడి కోరిక మేరకు ప్రంజిత్‌ 1976 నాటి ‘చిట్చోర్‌’ సినిమాలోంచి ‘గొరీ తేరా గావ్‌ బడా ప్యారా’ అనే పాటను పాడాడు. అతడి పాట ఎంతో వినసొంపుగా ఉండటంతో చక్రవర్తి దాన్ని వీడియో తీసి  సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

‘ఏదో ఒకనాటికి సింగర్‌ కావడం అతని ఆశయం. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి అతడి కలను సాకారం చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. చక్రవర్తి పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారి 9వేలకు పైగా లైక్స్, 7వేలకు పైగా షేర్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రంజిత్‌ గొంతు ఎంతో బాగుందని కామెంట్లు చేస్తున్నారు.