ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో గురించి తెలియని వారు ఉండరు. ఎప్పటికప్పుడు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. ఫుడ్ అందజేస్తూ ఉంటుంది. కాగా.. తాజాగా జొమాటో సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. జొమాటో సంస్థ ఫిబ్రవరిలో దాదాపు 5వేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించింది. ఈ విషయాన్ని జొమాటో అధికారికంగా వెల్లడించింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను సరిగా అందించడం లేదనే కారణంతో ఆ రెస్టారెంట్లను తన జాబితా నుంచి తొలగించినట్లు జొమాటో వెల్లడించింది. పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది.

దేశంలోని  150పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ విషయంపై జొమాటో సీఈవో మోహిత్ గుప్తా మాట్లాడుతూ.. నిత్యం తమ జాబితాలోకొ కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా కీలకమని ఆయన అన్నారు. తమతో అనుబంధం ఉన్న దాదాపు 80వేల రెస్టారెంట్లను మరోసారి పరిశీలించాలని అనుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని రెస్టారెంట్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు.