మేఘాలయ రాష్ట్రంలో  జీ న్యూస్  ఎగ్జిట్  పోల్స్‌లో  ఎన్ పీపీదే అధికారం  సాధించవచ్చని సర్వే సంస్థలు ప్రకటించాయి.   


న్యూఢిల్లీ: మేఘాలయ రాష్ట్రంలో ఎన్‌పీపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుపుతున్నాయి. పలు సర్వే సంస్థలు మేఘాలయ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సోమవారం నాడు వెల్లడించాయి.

జీ న్యూస్ సర్వే

ఎన్‌పీపీ -21-26
బీజేపీ- 6-11
కాంగ్రెస్-3-6

టీఎంసీ - 8-13

ఇతరులు-17

టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్

ఎన్‌పీపీ - 18 -26
బీజేపీ - 3 -6
కాంగ్రెస్ - 2 -5

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్
ఎన్‌పీపీ-18-24
కాంగ్రెస్-6-12
బీజేపీ-4-8

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​ అసెంబ్లీల ఎన్నికలకు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. త్రిపురలో ఈ నెల 16న పోలింగ్ జరిగింది. మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో మాత్రం సోమవారం (ఫిబ్రవరి 27) పోలింగ్ నిర్వహించారు. మేఘాలయ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 59 స్థానాలకు మాత్రమే ఎన్నిక నిర్వహించారు. మేఘాలయలోని సోహియాంగ్‌ నియోజకవర్గంలో యూడీపీ(యూనైటెడ్ డెమొక్రటిక్ పార్టీ) అభ్యర్థి హెచ్‌డీఆర్‌ లింగ్డో మృతిచెందడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో అక్కడ 59 స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. 

మొత్తం 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 36 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 10 మంది మహిళా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మేఘాలయలో మొత్తం.. 21.6 లక్షల ఓటర్లు ఉన్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 3,419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

2018 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రాంతీయ పార్టీ ఎన్‌పీపీకి 19 సీట్లు లభించగా.. బీజేపీ రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. యూడీపీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్‌ను ఓడించి.. యూడీపీ, బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్‌పీపీ నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి మాత్రం ఎన్‌పీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌, టీపీఎంసీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సింగిల్ గానే బరిలో దిగిన బీజేపీ కూడా.. కనీసం రెండంకెల స్థానాలను తాము గెలుస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెస్ కూడా తన సత్తాను నిరూపించుకోవాలని చూస్తుంది. ఇక, ఎన్‌పీపీ.. ఈ సారి ఎన్నికల్లో 56 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ పార్టీ 59 చోట్ల, బీజేపీ 59 చోట్ల, తృణమూల్ కాంగ్రెస్ 57 చోట్ల అభ్యర్థులను నిలిపింది. 

ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖుల విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా దక్షిణ తురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. విపక్ష నేత, టీఎంసీ నేత ముకుల్ సంగ్మా సాంగ్సాక్, తిక్రికిల్లా అనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆయన భార్య డిడి షిరా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాదేంగ్రేలో కాంగ్రెస్ అభ్యర్థి చెస్టర్‌ఫీల్డ్ సంగ్మా.. ఎన్‌పీపీ అభ్యర్థి జేమ్స్ సంగ్మాపై పోటీ చేస్తున్నారు. ఇక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన జరగనుంది.