అగ్నిపథ్ స్కీం విషయమై వైఎస్ షర్మిల ప్రధాని మోడీపై విమర్శలు కురిపించారు. ఆర్మీలోనూ ప్రధాని మోడీ కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగాలు తెచ్చారని విమర్శించారు. నాలుగేళ్ల కోసం ఆర్మీలో చేరిన యువత ప్రాణాలు కోల్పోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. 

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటు సీఎం కేసీఆర్, అటు పీఎం నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. సీఎం కేసీఆర్‌తోపాటు పీఎం మోడీ ఏం తక్కువ తినలేదని విమర్శించారు. అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీలోనూ కాంట్రాక్టుకు తెరలేపారని దుయ్యబట్టారు. ఆర్మీలో చేరే యువత కూడా కాంట్రాక్ట్ బేసిక్‌లో ఉద్యోగాలు చేయాలా? అని ప్రశ్నించారు. ఆ నాలుగేళ్ల కాలంలో ఆర్మీలో చేరి ప్రాణాలు కోల్పోతే బాధ్యలువరు? అని నిలదీశారు. ప్రాణాలు పణంగా పెట్టి ఆర్మీలో చేరుతుంటే.. దాన్ని షార్ట్ సర్వీసుగా మారుస్తారా అంటూ యువతలో ఆగ్రహం పెల్లుబికిందని వివరించారు. అందుకే వారు ఆందోళనలకు దిగారని వివరించారు.

యువతకు కోపం వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు చేశారని వైఎస్ షర్మిలా అన్నారు. ఈ ఆందోళనల్లో ఒక బిడ్డ చనిపోయాగా.. ఎందరో మంది గాయపడ్డారని వివరించారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఇదే అదును అని భావించి బీజేపీపై తుపాకీ ఎక్కుపెడుతున్నాడని ఆరోపించారు. అగ్నిపథ్ అని మోడీ మంట పెడితే.. సీఎం కేసీఆర్ ఆ మంటతో చలికాచుకుంటున్నారని విమర్శించారు.

గౌరవెల్లి భూ నిర్వాసతులు ఉధృతంగా ఆందోళనలు చేస్తుననారని, కాని, వారికి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారి త్యాగాలు మరువలేనిదని అన్నారు కదా అంటూ చురకలు అంటించారు. అలా అన్న కేసీఆర్ ఇప్పుడు నిర్వాసితులున్న ఊరంతా పోలీసులతో చుట్టుమట్టించి లాఠీ చార్జ్ చేపించారని ఆరోపించారు.

కేసీఆర్‌కు మన రాష్ట్రంలో కాక పొరుగు రాష్ట్రాల్లో కష్టాలు, సమస్యలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. స్వరాష్ట్ర ప్రజలను వదిలిల వేరే రాష్ట్రం పోయి డబ్బులు ఇచ్చి వస్తారని విమర్శించారు. ఇక చిన్నదొర కేటీఆర్‌కు ఏకంగా తెలంగాణలో కాకుండా ఆంధ్రలో ఫ్రెండ్స్ ఉంటారని ఫైర్ అయ్యాారు. మెగా కృష్ణా రెడ్డి వంటి ఆంధ్రా ఫ్రెండ్స్ ఉంటారని అన్నారు. ఇక్కడ కేసీఆర్, ఇతర పాలకులు ఏం పొడిచారని దేశ రాజకీయాల్లోకి వెళ్లుతున్నారని ఆమె అడిగారు.

బీఆర్ఎస్ పార్టీ పెడతారా? బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ అని ప్రజలు నవ్వుకుంటున్నట్టు వైఎస్ షర్మిల విమర్శించారు. అసలు ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని అడిగారు. అసలు దేశ రాజకీయాల్లోకి రమ్మన్నది మోడీని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వీరు బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.