కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను నడిపే పరిణతి రాహుల్ గాంధీకి లేదన్నారు. ఏ పార్టీకి కూడా రెండు పవర్ సెంటర్‌లు వుండజాలవని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత శశిథరూర్‌లు ఈ పదవికి పోటీ పడుతున్నారు. వీరు కాకుండా ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ను నడిపే పరిణతి రాహుల్ గాంధీకి లేదన్నారు. ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు కుర్చీలో తాత్కాలికంగా కూర్చొనే వ్యక్తి కోసం అన్వేషించేందుకే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏ పార్టీకి కూడా రెండు పవర్ సెంటర్‌లు వుండజాలవని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరును తెలుగు జాతి మర్చిపోదని ఆయన హెచ్చరించారు. 

అంతకుముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం కేరళలలో మీడియాతో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధ్యక్షుడిగా అందరి ప్రతిపాదనను అంగీకరించాలని నేను అతడిని (రాహుల్ గాంధీని) చాలాసార్లు అభ్యర్థించాను. కానీ గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి చీఫ్‌గా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు అని ఆయన అన్నారు. తాను త్వరలో ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేస్తానని గెహ్లాట్‌ తెలిపారు. దేశ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ALso REad:గాంధీ కుటుంబ స‌భ్యులెవ‌రూ కాంగ్రెస్ చీఫ్ కాకూడ‌ద‌ని రాహుల్ గాంధీ నాతో అన్నారు - అశోక్ గెహ్లాట్

పార్టీ మద్దతు ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే నిర్ణయంపై రాహుల్ గాంధీ ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు. తన నిర్ణయాన్ని ప్ర‌స్తావిస్తూ ‘‘ నేను (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ’’ అని చెప్పారు. కన్యాకుమారిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను నామినేషన్ దాఖలు చేయకుంటే నాయకత్వానికి ఎందుకు వ్యతిరేకమో అడగాలని, అప్పుడు సమాధానం చెబుతానని అన్నారు. కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 19న కౌంటింగ్ జరగనుంది.