ఢిల్లీలో ఆప్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి.ఈ ఫలితాల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది.  గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కాస్త పుంజుకున్నప్పటికీ.. పెద్దగా ప్రాబల్యం చూపలేదు.

ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడం కూడా వృథా. కనీసం బోనీ కూడా కట్టలేదు. ఒకప్పుడు దశాబ్దకాలంపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కి కనీసం ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే... అరవింద్ కేజ్రీవాల్ పై ఇప్పుడు అభినందనల జల్లు కురుస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ కి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు అభినందనలు తెలియజేశారు. ఫోన్ చేసి మరీ అభినందించారు. కాగా... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ కి అభినందనలు తెలిపారు.

Also Read బుల్లి మఫ్లర్ వాలా: కేజ్రీవాల్‌ను మరిపిస్తున్న చిన్నోడు, నెటిజన్లు ఫిదా...

దేశరాజధాని ఢిల్లీలో గుర్తుండిపోయే విజయాన్ని సాదించిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉంటే.. ఆప్ విజయంపై ప్రశాంత్ కిశోర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ ఆప్ ని గెలిపించి దేశ ఆత్మను ఢిల్లీ ప్రజలు కాపాడారని.. వారికి తాను దన్యవాదాలు తెలియజేస్తున్నాను’’  అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కాగా.. ఏపీలో జగన్ విజయానికీ, ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ విజయానికి వెనక ఉండి నడిపించింది అంతా ప్రశాంత్ కిశోరే కావడం గమనార్హం.