హోరాహోరీగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చి ఢిల్లీ సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొట్టి మరి కేజ్రీవాల్ విజయం సాధించడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సమయానికి తగ్గట్టుగా పొదుపుగా మాట్లాడే అరవింద్ కేజ్రీవాల్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన మఫ్లరే.

Also Read:ఢిల్లీ పీఠంపై మూడోసారి కేజ్రీవాల్.. అంతా ఫిబ్రవరి 14 మాయే!

దేశ రాజధానిలో చలిని తట్టుకునేందుకు గాను కేజ్రీవాల్ పైన టోపీ పెట్టి, తల చుట్టూ మఫ్లర్ ధరిస్తారు. దీనిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు జోకులు, కామెంట్లు వేస్తూ ఉంటారు కూడా. అంతలా పాపులరైన కేజ్రీవాల్ మఫ్లర్ వేషం వేసుకుని ఓ చిన్నారి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఢిల్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడానికి కొద్దిసేపటి క్రితం ఆప్ ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మఫ్లర్ మ్యాన్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.

Also Read:భార్య పుట్టిన రోజు కానుక: కేజ్రీవాల్ వెనక శక్తి ఆమెనే...

ఇప్పటికే దాదాపు 8 వేలమంది దీనిని లైక్ చేయగా.. 1,200 మంది రీట్వీట్ చేశారు. ‘‘సో క్యూట్’’... జూనియర్ కేజ్రీవాల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకు ఎంతో ఇష్టమైన మఫ్లర్ ఎందుకు ధరించడం లేదంటూ నెటిజన్లు అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు కూడా. కాగా ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా ఆప్ ఇప్పటి వరకు 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది