ఎవరైనా మద్యం అలవాటు ఉండి.. తర్వాత మానేస్తే.. మెచ్చుకోవాలి. అంతేకాని... మందు మానేసావు అని చితకబాదుతారా..? అలాంటి సంఘటనే అమృత్ సర్ లో చోటుచేసుకుంది. పెళ్లి అయ్యాక తమ స్నేహితుడు మందు మానేసాడని..యువకుడుపై అతని స్నేహితులు దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని భార్యను, ఇతర కుటుంబ సభ్యులను కూడా చావబాదారు. ఈ ఘటన ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.

వివరాల్లోకి వెళితే అమృత్ సర్‌లోని ఛెహరట్ ప్రాంతానికి చెందిన మహిళ సందీప్‌కౌర్ భర్త అమృత్‌పాల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. తన స్నేహితుడు జోధా సింగ్‌తో పాటు కూర్చుని మద్యం తాగేవాడు. కాగా అమృత్‌పాల్‌‌కు ఏడాది క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అతను మద్యం తాగడం మానివేశాడు. దీనితో పాటు స్నేహితులను కలవడం కూడా తగ్గించేశాడు. 

ఈ నేపధ్యంలో స్నేహితులంతా కలిసి అమృత్‌పాల్‌‌‌ను అతని ఇంటిముందు చావబాదారు. అంతేకాకుండా అడ్డువచ్చిన భార్య, ఇతర కుటుంబసభ్యులపైనా కూడా చేయిచేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.