కన్న తల్లి కోసం ఓ వ్యక్తి ఎనిమిదేళ్ల పాటు నిరీక్షించాడు. తనకు తెలిసిన చోటు.. తెలియని చోటు.. దాదాపుు 10 రాష్ట్రాలు జల్లెడ పట్టాడు. అతని నీరక్షణ ఫలించింది. చివరకు తన తల్లి దగ్గరకు చేరాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ లోని మాల్దా ప్రాంతానికి చెందిన దురాలీ అనే మహిళ భర్త, పిల్లలు ఉన్నారు. కాగా 2008లో ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె పెద్ద కుమారుడు ఉద్యోగం కోసం పానిపట్ వెళ్లాడు. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడి అతను చనిపోయాడు. కొద్ది కాలంలో భర్త, కుమారుడు దూరం అవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో.. పక్కనే చిన్న కొడుకు, కూతురు ఉన్నప్పటికీ ఆమె ఒంటరిదానిలా ఫీలయ్యింది.

అప్పటికే భర్త, కొడుకు పోయిన బాధలో ఉన్న ఆమెకు కూతురి మరణం మరో షాకిచ్చింది. కూతురికి పెళ్లి నిశ్చయించిన తర్వాత ఆమె అనుకోకుండా చనిపోయింది. కూతురి అంత్యక్రియలకు వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో.. ఆమె చిన్న కుమారుడు సుజీత్ ఆ నాటి నుంచి తల్లి కోసం వెతుకుతూనే ఉన్నాడు.

తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయినపుడు తనకు 16 ఏళ్లు అని, తల్లి కోసం పశ్చిమ బెంగాల్‌లో అణువణువునా గాలించానని, ఆ తరువాత బీహార్, మహారాష్ట్ర, అసోం, ఛత్తీస్‌గడ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో తిరిగానని తెలిపారు. తాను చదువును కూడా ఆపేసి, తల్లి కోసం ఊరూరా తిరిగానని పేర్కొన్నాడు. కాగా ఇటీవల పోలీసులు మతిస్థిమితం కోల్పోయిన ఆమెను మాతృఛాయా సంస్థకు తరలించారు. 

అక్కడ చికిత్స పొందిన అనంతరం ఆమె కోలుకుంది. తన చిరునామా అక్కడి వారికి తెలపడంతో వారు సంబంధింత పోలీసులకు ఈ విషయం చెప్పారు. ఫలితంగా సుజీత్‌కు తల్లిజాడ తెలిసింది. దీంతో అతను గోరఖ్‌పూర్ చేరుకుని తల్లిని కలుసుకున్నాడు. ఆమె కూడా కుమారుడిని గుర్తించి భోరున విలపించింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోయాక సిలిగురి, కోల్‌కతా, ముంబై ప్రాంతాలలో తల దాచుకున్నట్లు తల్లి తెలిపింది. అయితే గోరక్‌పూర్ ఎలా వచ్చానన్న విషయాన్ని ఆమె తెలియజేయలేకపోయింది.