చెన్నై: తమిళనాడు అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ప్రేయసి ఇంట్లో ప్రియుడు హత్యకు గురయ్యాడు. కడలూరులో ఈ సంఘటన జరిగింది. ప్రేయసి కోసం ఇంట్లోకి వెళ్లిన అతన్ని యువతి కుటుంబ సభ్యులు నరికి చంపేశారు. 

కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన ఆర్ముగరం కుమారుడు అన్నగళగన్ (21) స్థానికంగా ఓ కిరాణ దుకాణం నడుపుతున్నాడు. చిదంబరం అరంగనాథన్ వీధిలో ఉన్న బాబు కూతురు శ్వేత (18)తో పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిన్నరగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. 

లాక్ డౌన్ కారణంగా ప్రేయసిని చూడలేని పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో అతను ప్రేయసి ఇంటికి వెళ్లాడు. శ్వేత కుటుంబ సభ్యులు అతన్ని మందలించి వెనక్కి పంపించి వేశారు. అయితే, అతను తన ప్రయత్నం వీడలేదు. అతను గతవారం మరోసారి ఆ వీధిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతన్ని చిత్తుగా కొట్టి వెనక్కి పంంపించారు. 

పట్టు వీడని అన్నగళన్ శుక్రవారం సాయంత్రం ఆ ఇంట్లో ఎవరూ లేరనే సమాచారంతో శ్వేత కోసం వెళ్లాడు. అయితే, ఇంట్లో శ్వేత తండ్రి, తల్లి, సోదరుడు ఉండడం చూసి అతను షాక్ తిన్నాడు. అతన్ని వారు నరికి చంపేశారు. అక్కడికక్కడ అతను మరణించాడు. 

ఆ ఇంటి నుంచి రక్తం వాసన వస్తుండడంంతో పక్కింటి వారు లోనికి వెళ్లి చూశారు. మృతదేహం పడి ఉండడంతో వారు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. 

తమ పరువును బజారుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నాడనే కోపంతోనే అతన్ని చంపినట్లు ఓ లేఖ రాసి శ్వేత కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. బాబు (40), ఆయన భార్య సత్య (37), కుమారుడు జీవ (17), శ్వేత (18)లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.