సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. రోజుకి ఇలాంటి వార్తలు చాలానే వస్తున్నాయి. అయినా కూడా చాలా మందిలో మార్పులు రావడం లేదు. ఎక్కడైనా సెల్ఫీ దిగాల్సిందేనని భావిస్తున్నారు. తాము సెల్ఫీ దిగాలనుకుంటున్న ప్రదేశం ఎంత ప్రమాదమైందన్న విషయం మాత్రం వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు చాలా మంది ఈ పిచ్చితో ప్రాణాలు కోల్పోగా... తాజాగా ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ మెషిన్ పై ఉండి ఫోటో తీసుకుందామనుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా భీంగల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జాతర నిర్వహించారు. జాతరలో భాగంగా జెయింట్ వెల్,బ్రేక్ డ్యాన్స్ మెషిన్ లాంటివి ఏర్పాటు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి సరదగా బ్రేక్ డ్యాన్స్ మెషిన్ ఎక్కాడు. కాగా... అందులో కూర్చొని అది  కదులుతుండగా.. సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అది కదలడంతో జారి యంత్రాల మధ్యలో పడిపోయాడు. దీంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ మెషిన్ ఆపేసిన నిర్వాహకులు.. స్థానికుల సహాయంతో యువకుడిని  దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.