పైకి అమాయకంగా కనిపించే వారంతా ఇన్నోసెంట్ కాదని పెద్దలు అంటూ వుంటారు. అలా ఎందుకు చెబుతారో అప్పుడప్పుడు  కొన్ని సంఘటనలు మనకు తెలియజేస్తూ వుంటాయి. తాజాగా ఓ 23 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి వారిని, ఒకరికి తెలియకుండా మరోకరి చొప్పున 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన లవ్లీ గణేష్ (23) అనే యువకుడు కొలాత్తూర్ కు చెందిన 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోయి ఆమెను పెళ్లి చేసుకున్నారు.

అయతే తమ కూతురు కనపడక పోయే సరికి అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కిడ్నాప్ కేసు నమోదైందని తెలుసుకున్న గణేష్ విల్లివాక్కం పోలీసుల వద్దకు వెళ్లి అత్తమామల నుంచి రక్షణ కల్పించమని వేడుకున్నాడు.

పోలీసులు అమ్మాయి తల్లితండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే ఆ యువతి కూడా తన తల్లితండ్రులతో వెళ్ళటానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా తాను గణేష్‌ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, అతినితో వుంటానని తేల్చిచెప్పింది.

కూతురి సమాధానంతో ఖంగుతిన్న ఆ తల్లిదండ్రులు గుండెల నిండా బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం గణేశ్‌ ఆ యువతితో కలిసి విల్లివాక్కంలోని రాజాజీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు.

ఇదే సమయంలో అయనవరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ఇంట్లో పని చేయటానికి గణేష్ తీసుకువచ్చాడు. అయితే పనిమనిషి రాకను ఆ యువతి వ్యతిరేకించింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

దీంతో గణేష్ తన భార్యను ఒక గదిలో బంధించి తాళ్లతో కట్టేసి హింసించసాగాడు. అంతేకాకుండా ఆ బాలికతో భార్య ముందే సన్నిహితంగా మెలగటం ప్రారంభించాడు. కొన్నిసార్లు బాలికను ఎదురుగా పెట్టుకుని, తన భార్య కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. 

రోజు రోజుకు గణేష్ వేధింపులు పెరిగిపోయాయి. ఓ రోజున పనిమనిషిగా వున్న బాలికకు మద్యం తాగించి ఆమెపై అత్యాచారం చేశాడు. దానిని సెల్ ఫోన్ లో రికార్డు చేసి తన స్నేహితులకు ఫార్వార్డ్ చేశాడు. ఓ రోజున తన భార్య గదిలోకి నలుగురు స్నేహితులను పంపాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు.

ఈ విషయాన్ని గణేష్ భార్య. ఇంటి యజమానికి చెప్పి పుట్టింటికి చేరింది. గణేష్ ప్రవర్తనను తల్లితండ్రులకు చెప్పడంతో వారు వెంటనే విల్లివాక్కం మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు.

పోలీసు విచారణలో గణేష్ షాకింగ్ విషయాలు చెప్పాడు. తనకు ఇలాంటివి మామూలేనని ఇప్పటిదాకా ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం 11 మందిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. వారందరూ ఇప్పటికీ తనతో టచ్‌లోనే ఉన్నారని వెల్లడించడంతో పోలీసులు ఖంగుతిన్నారు.