చెన్నై: ప్రియురాలితో ఉన్న సమయంలో చూశాడని ఓ బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు ప్రేమికులు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా ఊత్తుకులి సమీపంలో చోటు చేసుకొంది.

పొట్టకవుండమ్‌పాలయం సమీపంలో తంగరాజ్, సుమతి దంపతులు నివాసం ఉంటారు. వీరికి విఘ్నేష్, భవనేష్ అనే ఇద్దరు సంతానం.వీరిద్దరూ కూడ ఒ బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉదయం పూట ఫ్యాక్టరీలో పనులకు వెళ్లి సాయంత్రం దంపతులు ఇంటికి తిరిగి వస్తారు. 

ఈ దంపతులు ఫ్యాక్టరీకి వెళ్లిన తర్వాత 8 ఏళ్ల భవనేష్ అదృశ్యమయ్యాడు. పని ముగించుకొని ఇంటికొచ్చాక దంపతులు తమ కొడుకు కోసం వెతికారు.  కానీ ఎక్కడా కొడుకు జాడ కన్పించలేదు. దీంతో ఊత్తుకులి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కూడ బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ దంపతులు నివాసం ఉండే ప్రాంతంలోని చెరువు వద్ద భవనేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కడుపు, గొంతు భాగంలో పొడిచి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

పవనేష్ ఇంటికి సమీపంలో ఉంటున్న కాలేజీ విద్యార్ధిని తన ప్రియుడైన పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థితో చెరువు వద్ద సన్నిహితంగా ఉంది.ఈ విషయాన్ని పవనేష్ చూశాడు.

తాము సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తించిన భవనేష్ బయట చెప్పే అవకాశం ఉందని అనుమానించిన ఆ లవర్స్ ఆ బాలుడిని మట్టుబెట్టారు. భవనేష్ ను కత్తితో పొడిచి చంపారు. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

భవనేష్ స్నేహితులను విచారిస్తే లవర్స్ ఈ బాలుడిని తీసుకెళ్లినట్టుగా చెప్పారు. దీని ఆధారంగా పోలీసులు ప్రేమ జంటను విచారిస్తే అసలు విషయాన్ని బయట పెట్టారు.