బాలిక బుగ్గ కొరికాడనే కారణంతో ఓ యువకుడికి న్యాయస్థానం 11 నెలల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పోస్కో చట్టం కింద బాలుడికి ఈ శిక్ష విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబై నగరానికి చెందిన 21 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల బాలిక బుగ్గ కొరికాడు. బాలిక పరీక్షల కోసం ఇంట్లో ఉండి చదువుకుంటుండగా, ఆమె తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లారు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండగా చూసిన ఓ యువకుడు వచ్చి ఆమె బుగ్గ కొరికి పారిపోయాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు నిందితుడైన యువకుడిపై ఐపీసీ 354 ఎ, 448,పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతాశర్మ బాలిక బుగ్గ కొరకడంతో అయిన గాయంపై మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దీంతో బాలిక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఆమె బుగ్గ కొరికినందుకు నిందితుడైన యువకుడికి 11 నెలల జైలు శిక్షతోపాటు వెయ్యిరూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది.