టిక్ టాక్.. ఈ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  సినిమాల్లో పాటలు, డైలాగ్ లకు లింప్ సింక్ ఇస్తూ, డ్యాన్సులు వేస్తూ యూత్ ఈ యాప్ ని విపరీతంగా వాడేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెలబ్రెటీ హోదా తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

అయితే.. ఈ యాప్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా.. ఈ జాబితాలో మరో యువకుడు చేరాడు. జీవితంలో ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. ఆ అనుభవం ఎలా ఉంటుందో చవిచూడాలని, దానిని టిక్‌టాక్‌ చేయాలని ఒక యువకుడు దుస్సాహసం చేశాడు. ఆ ప్రయత్నంలో పురుగుల మందు తాగి మరణించిన సంఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలుకాలో ఆదివారం చోటు చేసుకుంది. 

బాధిత యువకుడు కొరటిగెరె తాలూకాలోని గౌరగానహళ్ళి గ్రామానికి చెందిన ధనంజయ (25) కాగా..ఇతనికి టిక్‌టాక్‌ వీడియోలు చేయడమంటే మోజు. చనిపోతే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ పొలాలకు కొట్టే పురుగుల మందు తాగి వీడియో తీసుకున్నాడు. 

అతని పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గమనించి కొరటిగెరెలో ఉన్న ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కొరటిగెరె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు