ఓ వైపు కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ నుంచి ప్రపంచాన్ని రక్షించాలని ప్రభుత్వాలు, వైద్యులు నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో.. ఓ యువకుడు టిక్ టాక్ పిచ్చిలో ప్రాణాలు కోల్పోయాడు. 

టిక్‌టాక్‌కు బాగా బానిసైన 18 ఏళ్ల యువకుడు తాను చేసే వీడియోలకు లైకులు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నోయిడాలోని సాలార్పూర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. టిక్‌టాక్‌‌కి బానిసైన యువకుడు అందులో రకరకాల వీడియోలు చేయడం, స్టంట్లు చేయడం వంటివి వ్యూయర్స్ మెచ్చేలా చేసేవాడు. అయితే ఎంత క్రియేటివిటీ ఉపయోగించి వీడియోలు చేసినా.. అతనికి లైకులు వచ్చేవి కాదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు.. తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

 కాగా అనుమానస్పదంగా యువకుడు మృతి చెందడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గత కొద్ది రోజులుగా టిక్‌టాక్‌లకు లైకులు రావట్లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారణలో తేలినట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.