ఆత్మహత్య చేసుకున్న బాలిక మండ్య నగర సభ స్థాయి సమితి అధ్యక్షుడు శివలింగ కుమార్తె కావడం గమనార్హం. 


ప్రియుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య నగరంలోని బాల మందిరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్మహత్య చేసుకున్న బాలిక మండ్య నగర సభ స్థాయి సమితి అధ్యక్షుడు శివలింగ కుమార్తె కావడం గమనార్హం. ఆమె వయసు 17 ఏళ్లు అని పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విశ్వేశ్వరయ్య లేఔట్‌లో నివాసం ఉంటున్న దర్శన్, మాన్విత ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి శివలింగ ఏప్రిల్‌ 14న పథకం ప్రకారం కుమార్తెను బెదిరించి దర్శన్‌కు ఫోన్‌ చేసి రప్పించారు. అనంతరం తీవ్రంగా కొట్టారు. చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా అతను మృతి చెందాడు.

ఈ కేసులో తండ్రి శివలింగతో పాటు తల్లి అనురాధ, మరో 17 మందిని పోలీసులు జైలుకు పంపించారు. ఈ క్రమంలో మాన్వితను అధికారులు బాల మందిరంలో ఉంచారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న అమ్మాయి తన ప్రియుని సమాధిని చూపించాలని గొడవ చేసేది. మంగళవారం తెల్లవారుజామున తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.