ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఆడపిల్లలపై దాడులు, వేధింపులు ఆగడం లేదు. ప్రేమించమని వెంటపడటం.. కాదంటే చంపేయడం.. నిత్యం ఏదో ఒక చోట ఈ దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

మేరట్‌: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఆడపిల్లలపై దాడులు, వేధింపులు ఆగడం లేదు. ప్రేమించమని వెంటపడటం.. కాదంటే చంపేయడం.. నిత్యం ఏదో ఒక చోట ఈ దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తమతో ఫోన్లో మాట్లాడలేదని ఓ యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు కొందరు యువకులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

మేరట్‌లోని సర్దానా ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో కొంత కాలంగా ఓ గ్యాంగ్ వేధిస్తోంది. గత గురువారం ఆ యువతి కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆ గ్యాంగ్‌లోని ఓ యువకుడు ఆమెను అడ్డుకుని ఓ ఫోన్‌ను బలవంతంగా చేతిలో పెట్టాడు. అర్ధరాత్రి ఫోన్‌ చేయమని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యువతి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి ఆ ఫోన్‌ వారికి ఇచ్చేసింది. అర్ధరాత్రి సమయంలో యువకుడు ఫోన్‌ చేయగా.. యువతి తండ్రి లిఫ్ట్‌ చేసి అతడిని మందలించాడు. 

ఆ మరుసటి రోజు యువకుడి ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. అప్రమత్తమైన యువతి కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.