చనిపోయిన వ్యక్తికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అతని చితికి నిప్పు పెట్టి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ... అక్కడి నుంచి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. అయితే.... ఓ యువకుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. చితి వద్ద తాంత్రిక పూజలు చేశాడు. అనంతరం కాలుతున్న చితిలో నుంచి తలను బయటకు తీశాడు. కాగా... అనుకోకుండా ఈ దృశ్యాన్ని చూసిన మృతుని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ దర్వాజే ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ దర్వాజే ప్రాంతంలో ఒక మధ్యవయస్కుడు మృతి చెందగా, ఒక శ్మశానవాటికలో దహన సంస్కారాలను నిర్వహించారు. తిరిగి రాత్రి 12 గంటల సమయంలో మృతుని కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు వెళ్లి చూడగా, ఒక యువకుడు మండుతున్న చితి దగ్గర తాంత్రిక క్రియలు చేసి, ఆ చితిలో నుంచి తలను తీస్తూ వారికి కనిపించాడు. 

దీంతో మృతుని కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, ఆ యువకుడిని వారికి అప్పగించారు. ఈ ఘటనపై  రాజ్‌గఢ్ నివాసి గౌరవ్ జోషి మాట్లాడుతూ తన పెద్దనాన్న రాజారామ్ జోషి ఆలయంలో పూజారిగా పనిచేస్తుంటాడని, అనారోగ్యంతో మృతి చెందాడని తెలిపారు. 

తరువాత శ్మశానవాటికలో అతనికి అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోయామని తెలిపారు. అయితే రాత్రి అయ్యాక శ్మశానానికి వెళ్లామన్నారు. అయితే అప్పటికే ఒక గుర్తుతెలియని యువకుడు ఆ చితి ముందు కూర్చుని తాంత్రిక క్రియలు చేస్తూ, చితిలోని కర్రలను దూరం జరిపి అందులో నుంచి తలను తీయడాన్ని తమ బంధువు గమనించాడన్నారు. 

దీంతో వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించామన్నారు. కాగా పోలీసులు నిందితుడిని స్థానికంగా ఉంటున్న సునీల్‌గా గుర్తించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.