మైనర్ బాలిక అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. అయితే.. బాలిక పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని అనంతరం ఆ బాలికను అతి దారుణంగా హత్య చేశారని ఆరోపణలు మొదలయ్యాయి. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడని అందరూ భావించిన యువకుడు.. మరుసటి రోజే.. శవమై కనిపించాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌, నార్త్ దీనాజ్‌పూర్ జిల్లా చోప్రా ప్రాంతంలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నార్త్ దీనాజ్ పూర్ జిల్లాకి చెందిన బాలిక ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. కాగా.. ఇటీవల ఆ బాలిక చనిపోగా.. అత్యాచారం చేసి.. హత్య చేశారంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె కుటుంబం బీజేపీ మద్దతుదారులని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లేవని, విష ప్రయోగం వల్లే బాలిక చనిపోయినట్టు వెల్లడైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చోప్రా పోలీస్ స్టేషన్ ఇన్‌‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ బినోద్ గాజ్మెర్ తెలిపారు.

కాగా, బాలిక, యువకుడు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామాన్ని సందర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర నాయకులను  పోలీసులు అడ్డుకున్నారు. బాలిక మృతి చెందిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే యువకుడి మృతదేహాన్ని నీటిలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. యువకుడి ముఖం ఎర్రగా మారిందని, పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణం బయటకు వస్తుందని పేర్కొన్నారు. 

బాలిక, యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు టీఎంసీ జిల్లా అధ్యక్షుడు కనైయ లాల్ అగర్వాల్ తెలిపారు. తమ మధ్య బంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్లే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలను బాధిత బాలిక తండ్రి ఖండించాడు.

యువకుడు చాలా కాలంగా తన కుమార్తెను వేధిస్తున్నాడని, అతడే తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఆరోపించాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన తెలియజేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. మరోవైపు, ఈ ఘటనపై గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆరా తీశారు. ఈ విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చించనున్నట్టు ఢిల్లీకి వెళ్తూ పేర్కొన్నారు.