తాను బాగోకపోయినా తమ్ముడు బాగుండాలనే అన్నలను ఎంతోమందిని చూశాం. కానీ తన సోదరుడి ఎదుగుదలను ఓర్చుకోలేని ఓ అన్న ఈర్ష్యతో కుటుంబాన్ని సజీవదహనం చేశాడు. వివరాల్లోకి వెళితే... పశ్చిమబెంగాల్ మాల్లా జిల్లా మదన్‌తోలా అనే గ్రామానికి చెందిన మఖాన్ మోందల్ తన ఇద్దరు సోదరులు, తల్లితో కలిసి జీవిస్తున్నాడు.

ఇటీవల వీరి కుటుంబసభ్యుడు గేడు మోందల్ నేషనల్ వాలంటీర్ ఫోర్సులో ఉద్యోగం చేస్తూ మరణించాడు. దీంతో కారుణ్య నియామకం కింద వచ్చిన ఉద్యోగాన్ని వికాశ్ సాయంతో గోవిందా సొంతం చేసుకున్నాడు..

దీనిని జీర్ణించుకోలేని మఖాన్.. తన అన్న, తమ్ముడిపై కక్ష పెంచుకున్నాడు. ద్వేషంతో రగిలిపోతూ ఆదివారం రాత్రి పెట్రోలు పోసి తన కుటుంబసభ్యులు నిదురిస్తున్న పెంకుటిల్లుకు నిప్పంటించాడు.

ప్రమాదంలో తమ్ముడు గోవిందా, అన్న వికాశ్, గోవిందా ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. వికాశ్ భార్య, కుమారుడు, కుమార్తె, గోవిందా భార్య మాల్దా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్ధితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది.

ప్రమాద సమయంలో వీరి తల్లి వేరే గదిలో నిద్రిస్తుండటంతో ప్రాణాలు దక్కించుకుంది. ఇంతటి దారుణానికి పాల్పడిన మఖాన్ భార్య పుట్టింట్లో ఉండటం వల్ల ఆమె కూడా ప్రమాదం నుంచి బయటపడింది.