అతను ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే.. వారి ప్రేమను ప్రేయసి తల్లి అంగీకరించలేదు. దీంతో.. కోపంతో విధ్వంసం సృష్టించాడు. తన స్నేహితుడితో కలిసి ఆటోలు, కార్లు, బైక్ లను నాశనం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శరత్‌ తుకారామ్‌ పటోల్‌ అనే యువకుడు అన్నాభవూ సతేనగర్‌, బిద్వేవాడికి చెందిన ఓ యువతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇద్దరి పెళ్లి విషయం మాట్లాడటానికి అతడు ప్రియురాలి ఇంటికి వెళ్లాడు‌. ప్రియురాలిని తన కిచ్చి పెళ్లి జరిపించాలని ఆమె తల్లిని అడిగాడు. ఇందుకు ఆమె ససేమీరా అంది.

దీంతో ఆగ్రహించిన అతడు స్నేహితుడితో కలిసి ఇంటి చుట్టు ప్రక్కల నిలిపి ఉంచిన వాహనాలపై విరుచుకుపడ్డాడు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశాడు. దీంతో చుట్టుప్రక్కలి వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువతిని, ఆ ఇద్దరు యువకుల్ని విచారించారు. యువకులు తామే నేరం చేశామని ఒప్పుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచారు.