ప్రేమను కాదన్నదని.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై యాసిడ్ పోసిన వారిని, కత్తితో నరికేసిన వారిని చూశాం. అయితే ముంబైలో ఓ వ్యక్తి పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిని రైలు కిందకు నెట్టేందుకు యత్నించాడు.

నగరంలోని వడాలాకు చెందిన సుమేథి జాదవ్‌, బాధిత యువతి గతంలో ఒకే చోట కలిసి పనిచేశారు. ఈ సమయంలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, జాదవ్‌ మద్యానికి బానిసయ్యాడని తెలుసుకున్న ఆమె అతడ్ని దూరం పెట్టింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాదవ్ అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఆదివారం అంథేరిలో యువతి రైలు ఎక్కగా ..జాదవ్‌ ఆమెను వెంబడించాడు.

యువతి భయంతో తల్లికి ఫోన్‌ చేయగా ఆమె కార్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. మరోసారి యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జాదవ్‌ లోకల్‌ రైలు వచ్చే సమయంలో ఆమెను రైలుకిందకు తోసేందుకు ప్రయత్నించాడు.

యువతి, ఆమె తల్లి తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ పెనుగులాటలో యువతి తలకు గాయమైంది. అప్పటికే జనం పోగవ్వడంతో జాదవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాదవ్‌ను అరెస్టు చేశారు.