మనసుకి నచ్చినవారు పరిచయం అయితే... ఒకరిని మరొకరు ప్రేమించుకుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు సరదాలు, షికార్లు కూడా చాలా కామన్. అయితే... ప్రేమించుకున్నంత ఈజీ కాదు... పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే.. ఆ ప్రేమను పెద్దవాళ్లకు చెప్పి.. ఇంట్లో వాళ్లని ఒప్పించాలి కదా. ఆ ధైర్యం చాలా మంది చేయరు. కానీ... ఓ జంట విషయంలో వాళ్లు చేయలేని పనిని ట్రాఫిక్ చలానా చేసిపెట్టింది. 

మీరు చదవింది నిజమే... ట్రాఫిక్ చలానా కారణంగా ఓ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి చెందిన ఫరేఖ్ అనే యువకుడు గత కొంతకాలంగా ఓ యువతితో ప్రమలో ఉన్నాడు. ఓ రోజు ప్రేయసితో కలిసి బండి మీద షికారుకు వెళ్లాడు. అయితే.. ఆ సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు.

ఇంకేముంది.. ట్రాఫిక్ వాళ్లు ఫోటో తీసి దానిని ఇంటికి పంపించారు. చలానా వచ్చినందుకు కాదు కానీ.. తమ కుమారుడి బైక్ వెనుక వేరే అమ్మాయి కూర్చోవడం వాళ్లకు షాకింగ్ గా అనిపించింది. వెంటనే తమ కుమారుడిని నిలదీశారు. దీంతో ప్రేమ వ్యవహారం బయటపెట్టాడు.

ఇంట్లో వాళ్లు ఏమంటారోనని అంతను కంగారు పడుతుంటే... ఫరేఖ్ ప్రేమకు వారు అంగీకారం తెలిపారు. స్వయంగా యువతి ఇంటికి వెళ్లి వాళ్ల పేరెంట్స్ తో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి ఎన్ని తంటాలు పడాలో అని అనుకుంటే ఇంత సులభంగా ట్రాఫిక్ చలానాతో పని జరుగుతుందని వారు ఊహించలేదు. అందుకే ట్రాఫిక్ అధికారులు ఆ యువకుడు దన్యవాదాలు తెలిపాడు.