ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఓ 25ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి  పాల్పడమే కాకుండా హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన నవీ ముంబైలో జరిగింది.

వివరాల్లోకి వెళితే... ముంబైలోని టిట్వాలాలో కుటుంబంతో కలిసి నివాసముండే యువతి పోవైలో ఇంటిపనులు చేసుకుంటూ జీవించేది. వారం మొత్తం పనిచేస్తున్న ప్రాంతంలోనే వుండగా ఏదో ఒకరోజు వీలు కుదుర్చుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేది. ఇలా ఇంటికి వెళ్లిన యువతి తిరిగి పనిచేసే ప్రాంతానికి బయలుదేరి కనిపించకుండా పోయింది.

దీంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఓ రైల్వే ట్రాక్ పై యువతి ప్రాణాపాయ స్థితిలో వున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.

అయితే వైద్యపరీక్షల్లో యువతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. అంతే కాకుండా ఆమెను వేగంగా వెళుతున్న రైల్లోంచి తోసేయడం వలనే ఇంత తీవ్రంగా గాయపడి వుంటుందన్నారు. ప్రస్తుతం యువతి మాట్లాడే పరిస్ధితుల్లో లేదని... ఆమే కోలుకున్నాక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.