ఏఐతో నారింజ తోటను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్న యువ రైతు గౌరవ్ బిజ్వే, విదర్భలో సాగును లాభదాయకంగా మార్చి ఆదర్శంగా నిలిచాడు.

తెల్లవారు జామునే పొలాలకు వెళ్లే రైతుల బాటకు భిన్నంగా, మహారాష్ట్రకు (maharashtra)చెందిన ఓ యువ రైతు ఇంటి నుంచే నారింజ తోటను పర్యవేక్షిస్తున్నాడు. అది కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి. మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలోని ఖార్పి గ్రామానికి చెందిన గౌరవ్ బిజ్వే అనే రైతు, కరవు ఎక్కువగా ఉండే విదర్భ ప్రాంతంలో సాగు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాడు.

కృత్రిమ మేధ ఆధారంగా సాగు…

ఆరు దశాబ్దాలుగా సాగు సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఈ ప్రాంతంలో, గౌరవ్ తన 8 ఎకరాల భూమిలో 1200 నారింజ చెట్లను అత్యాధునిక పద్ధతిలో పెంచుతున్నాడు.కానీ ఒక్కనాడు కూడా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే తన మొబైల్ యాప్ సాయంతో తోటను నిత్యం పర్యవేక్షిస్తున్న గౌరవ్, కృత్రిమ మేధ ఆధారంగా సాగు చేసే తొలి రైతుల్లో ఒకరిగా నిలిచాడు.

ఈ వ్యవస్థ అమలు కోసం ఆయన దాదాపు రూ.60 వేలు ఖర్చు చేశాడు. నేల ఆర్థ్రత, వాతావరణం, ఉష్ణోగ్రత వంటి అంశాలను ట్రాక్ చేసే సెన్సర్లు వ్యవస్థలో భాగమయ్యాయి. ఇవి పంటపై చీడపీడల ముప్పు ఉన్నట్లయితే ముందే సమాచారం ఇస్తాయి. దీనివల్ల నీటి వినియోగం తగ్గింది, పురుగుమందుల వినియోగాన్ని నియంత్రించగలిగాడు.

గత కాలానికి పోల్చితే ఈసారి ప్రతి చెట్టుపై సగటున 1000 నుంచి 1500 నారింజలు వచ్చినట్లు గౌరవ్ చెప్పారు. నాసిక్‌కు చెందిన వ్యవసాయ నిపుణులు ఈ తోటను పరిశీలించి, దేశంలో నారింజ సాగులో ఇదే తొలి ఏఐ ప్రయోగమని పేర్కొన్నారు. ఇప్పుడు గౌరవ్ తోటను పరిశీలించేందుకు పలు ప్రాంతాల నుంచి రైతులు, నిపుణులు తరలివస్తున్నారు.