కన్యాకుమారి: ప్రభుత్వ ఉద్యోగం వస్తే అందరూ ఆనందపడతారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విచిత్ర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు ప్రభుత్వ ఉద్యోగం కావడమే కారణమంటూ సూసైడ్ నోట్ రాసిమరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో నవీన్(32) అనే యువకుడు చాలా కష్టపడి చదివి ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే అంతకంటే ముందు ఉద్యోగ ప్రయత్నంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో భగవంతుడిపై భారం వేశాడు. తనకు ఉద్యోగం ప్రసాదిస్తే మొక్కు చెల్లించుకుంటానని కోరుకున్నాడు. 

అయితే అతడు ప్రభుత్వ ఉద్యోగం కోసం విచిత్రమైన మొక్కు చెల్లించడానికి సిద్దమయ్యాడు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చినతర్వాత ఓ 20రోజులు విధులు నిర్వహించిన అతడు దేవుడి మొక్కు చెల్లించుకోడానికి సిద్దమయ్యాడు. ముంబై నుండి త్రివేండ్రంకు రైలులో బయలుదేరి మార్గమధ్యలో ఓ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో తన ఆత్మహత్యకు గల కారణాన్ని వెల్లడించాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే తనకు తానుగా బలి అవుతానని దేవున్ని మొక్కుకున్నానని... అందుకోసమే ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరయినా హత్య చేసి ఇలా సూసైడ్ నోట్ రాశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.