చెన్నై: తమిళనాడులోని ఆర్కాడు సమీపంలోని ముప్పదు వెట్టి పుదియ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సూర్య(26) అనే యువకున్ని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... ఆర్కాడ్ కు చెందిన శక్తివేల్ తనయుడు సూర్య. ఇతడు రాణిపేటలో ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా గుట్టుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం ఇటీవలే అమ్మాయి కుటుంబసభ్యులకు తెలిసింది. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను అంగీకరించని పెద్దలు సూర్యను మందలించారు.

అయినప్పటికి సూర్య తన ప్రియురాలితో ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు గురువారం ఇంటినుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతకగా గ్రామం సమీపంలోని చెరువు గట్టు వద్ద కత్తిపోట్లకు గురై మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. ఇది ఖచ్చితంగా పరువుహత్యగా సూర్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూర్య మ్రుతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.