ముంబై: ముంబైలో మారణహోమం సృష్టించిన  లష్కరే తొయిబా ఉగ్రవాది అజ్మల్‌ అమిర్‌ కసబ్‌‌ను ఉరి తీసే ముందు మీరు గెలిచారు. నేను ఓడిపోయాను అంటూ వ్యాఖ్యానించాడు.  ముంబైలో మారణహోమం ఈ నెల 26వ తేదీకి పదేళ్లు కావోస్తోంది. 

ముంబై మారణహోమానికి కారకుడైన కసబ్‌ను  అరెస్ట్ చేసిన తర్వాత రమేష్ మహలే అనే ఇన్స్‌పెక్టర్  తొలుత విచారించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ నెంబర్ 1కు  ఆయన అప్పట్లో హెడ్‌గా పనిచేసేవాడు.  2013లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. 81 రోజుల పాటు కసబ్‌ను  విచారించారు. 

భారత చట్టాల నుండి సులభంగా తప్పించుకోవచ్చనే  భావనతో కసబ్ ఉండేవాడని  మహలే అభిప్రాయపడ్డారు. ముంబై మారణ హోమాన్ని  కసబ్‌ విచారణ సంగతులను ఆయన  గుర్తు చేసుకొన్నారు. 

కసబ్ తనంతట తానుగా దాడి గురించి నోరు విప్పలేదు.  విచారణలో భాగంగా తాము అడిగిన  ప్రశ్నలకు ఏ నాడూ కూడ కసబ్ సరైన సమాధానం చెప్పలేదన్నారు.తమను తప్పుదారి పట్టించేందుకు అడ్డగోలు సమాధానాలు చెప్పేవాడని ఆయన చెప్పారు. భారతీయ చట్టాల గురించి మాట్లాడుతూ దేశంలో చట్టాలను అమలు చేయడంలో అలసత్వం కారణంగా  తనకు మరణశిక్ష విధించినా అమలు జరగకపోవచ్చని కసబ్ అభిప్రాయపడినట్టు ఆయన ప్రస్తావించారు.

పార్లమెంట్‌పై దాడి ఘటనను ప్రస్తావిస్తూ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించి కూడ ఎనిమిదేళ్లు దాటినా కూడ శిక్ష అమలు కాని విషయాన్ని తనతో చెప్పారన్నారు. తాను ముంబైకి  సరైన వీసా తీసుకొని వచ్చినట్టు కసబ్  న్యాయస్థానం ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేసే సమయంలో చెప్పిన మాటలు షాక్‌కు గురిచేసినట్టు మహాలే చెప్పుకొచ్చారు. ముంబైలో అమితాబ్‌ను చూసేందుకు తాను వచ్చిన సమయంలో  పోలీసులు తనను అరెస్ట్ చేశారన్నారు. తన చేతి మీద కాల్చి ముంబై దాడి కేసులో ఇరికించారని చెప్పారన్నారు.

ఈ కేసులో అందరి వాదనలు విన్న తర్వాత 2012 నవంబర్ 11వ తేదీన కసబ్ కు  కోర్టు ఉరిశిక్ష విధించింది. నవంబర్ 21న ఉరిశిక్ష అమలు చేసేందుకు  పూణెలోని ఎరవాడ జైలుకు కసబ్‌ను తీసుకెళ్లారు. నవంబర్ 19వ తేదీన తాను కసబ్ ను కలిసినట్టు మహాలే గుర్తు చేసుకొన్నారు. భారతీయ చట్టాల గురించి గతంలో కసబ్ చేసిన వ్యాఖ్యల గురించి తాను ప్రస్తావిస్తే... మీరు గెలిచారు.. నేను ఓడిపోయాను  అని చెప్పాడని మహలే చెప్పారు. కసబ్ ను ఉరితీసిన క్షణాల్లో తాను ఆనందపడ్డానని చెప్పారు.