పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకుంటే.. భూమిపై జీవరాశి మనుగడకు ముప్పు తప్పదని నిపుణులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిందని.. ఇకనైనా పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు వారి బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నారు. 

పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకుంటే.. భూమిపై జీవరాశి మనుగడకు ముప్పు తప్పదని నిపుణులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిందని.. ఇకనైనా పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు వారి బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నారు. కాలుష్యాన్ని, ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాలని పిలుపునిస్తున్నారు. అప్పుడే భవిష్యత్తు తరాలను మంచి పర్యావరణ వ్యవస్థను అందించనవాళ్లం అవుతాం. అయితే ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఐక రాజ్య సమితి ప్రతి ఏడాది జూన్ 5 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంది. అయితే భారత్‌లో కూడా పర్యావరణ రక్షణకు పెద్ద యుద్దమే జరుగుతుంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ దేశంలో కొందరు స్వలాభం కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూనే ఉన్నారు. కానీ పర్యావరణ ప్రేమికులు మాత్రం పర్యావరణంపై ప్రజల్లో అవగాహనను పెంచడంతో పాటు.. ప్రకృతి రక్షణకు కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకోందాం.. 

సుందర్‌లాల్ బహుగుణ.. ఈయనను పర్యావరణ శక్తిగా పిలుస్తుంటారు కొందరు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ సమీపంలో ఉన్న మరోడా గ్రామంలో జన్మించారు. పర్యావరణ రక్షణ కోసం ఆయన అనేక రకాలుగా పోరాటం సాగించారు. చెట్లను నరకివేయవద్దంటూ అమరణ నిరహార దీక్షకు కూడా దిగారు. చెట్లను హత్తుకుంటూ.. వాటి విలువను చాటిచెబుతూ ఆయన చేసిన చిప్కో ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భాగీరథి నదిపై ఉత్తరాఖండ్‌లో తెహ్రీ ఆనకట్ట నిర్మించడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహ, నిరాహార దీక్షలు చేశారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. పర్యావరణ రక్షణ కోసం ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయన సత్కరించింది. అయితే గతేడాది కరోనాతో ఆయన కన్నుమూశారు. 

తులసి గౌడ.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించిన తులసి గౌడ తన జీవితకాలంలో 30,000 మొక్కలు నాటారు. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పేరుపొందారు. తొలుత తులసి గౌడ కర్ణాటక అటవీ శాఖలో వాలంటీర్‌గా చేరారు. పర్యావరణ పరిరక్షణలో ఆమె అంకితభావం, నిబద్ధతను గమనించిన ప్రభుత్వం ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసింది. పదవి వీరమణ తర్వాత కూడా ఆమె మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తోంది. పర్యావరణ రక్షణకు గానూ ఆమె చేస్తున్న సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇటీవల ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 

చండీ ప్రసాద్ భట్.. సామాజిక కార్యకర్త అయిన చండీ ప్రసాద్ భట్.. గోపేశ్వర్ యొక్క దషోలి గ్రామ స్వరాజ్య సంఘ్‌ను స్థాపించారు. ఈ సంస్థ తరువాత చిప్కో ఉద్యమం యొక్క మాతృ సంస్థగా మారింది. ఇందులో భట్ మార్గదర్శకునిగా ఉన్నారు. అతను 1982లో కమ్యూనిటీ లీడర్‌షిప్ కోసం రామన్ మెగసెసే అవార్డును, 2005లో పద్మభూషణ్‌ను అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఆధునిక పర్యావరణవేత్తలలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. సబాల్టర్న్ సోషల్ ఎకాలజీపై చేసిన కృషికి కూడా పేరు పొందారు. ఆయన 2013లో గాంధీ శాంతి బహుమతిని అందుకున్నారు. 

హిమ్మత్ రామ్ భంభు.. పర్యావరణ కార్యకర్త, వన్యప్రాణి సంరక్షకుడిగా పేరుపొందిన హిమ్మత్ రామ్ భంభు రాజస్థాన్‌కు చెందినవారు. తన గ్రామ సమీపంలోని భూమిలో 11,000 చెట్లను నాటడం ద్వారా అడవిని పెంచినందుకు ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన ఐదేళ్లలో ఐదు లక్షల చెట్లను కూడా నాటారు. కృష్ణజింకలు, చింకరాలు, నెమళ్లను.. వేటాడటం, అక్రమ స్మగ్లింగ్‌ చేయడం వంటి వాటికి వ్యతిరేకంగా తన వంతు కృషి చేస్తున్నాడు. 

వనజీవి రామయ్య.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపెల్లి రామయ్య ప్రకృతి ప్రేమికుడు. అయితే ఆయన పెద్ద సంఖ్యలో మొక్కలను నాటడం వల్ల ఆయనను అంతా వనజీవి రామయ్య అని పిలుస్తారు. ఆయన కోటికిపైగా మొక్కలు నాటినట్టుగా చెబుతారు. వృక్షోరక్షతి.. రక్షితః అని రాసిన అట్ట ముక్కను ధరించి.. ఆయన మొక్కల పెంపకం గురించి చుట్టపక్కల ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. “నా ప్రాంతంలో ఎక్కడ బంజరు భూమి కనిపిస్తే అక్కడ ఒక చెట్టు నాటుతాను. నేను నాటిన ప్రతి మొక్క బతికేలా చూడడమే నా లక్ష్యం. ఒక్క మొక్క వాడిపోయి చచ్చిపోయినా, నా ప్రాణం పోయినట్లే అనిపిస్తుంది” అని వనజీవి రామయ్య చెబుతుంటారు. వివాహమైనా, పుట్టినరోజునా, వివాహ వార్షికోత్సవమైనా వనజీవి రామయ్య మొక్కలు బహుమతిగా ఇస్తుంటారు. ఆయన చేస్తున్న హరిత ప్రచారానికి గుర్తింపుగా అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. ఆయన చేస్తున్న సేవను గుర్తించిన భారత ప్రభుత్వం.. ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.