Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri: అది ఘోరమైన నేరమే.. కానీ, మినిస్టర్ కొడుకు దేశం విడిచి పారిపోయే ముప్పేం లేదు: సుప్రీంలో యూపీ

లఖింపూర్ ఖేరి కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఘోరమైన నేరమేనని, దాన్ని ఖండించడానికి పదాలూ సరిపోవని పేర్కొంది. అయితే, బెయిల్ పొందిన అశిశ్ మిశ్రా దేశం వదిలి పారిపోయే ముప్పేమీ లేదని వివరించింది.
 

yogi govt arguments on minister son ashish mishras bail in lakhimpur kheri case in supreme court
Author
New Delhi, First Published Apr 4, 2022, 1:06 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించిన కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా నిందితుడిగా ఉన్నసంగతి తెలిసిందే. ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్‌ను సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున మహేశ్ జెఠ్మలానీ వాదించారు.

లఖింపూర్ ఖేరి ఘటన ఘోరమైన నేరమేనని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ఘటనను ఖండించడానికి పదాలు సరిపోవనీ వ్యాఖ్యలు చేసింది. మినిస్టర్ కొడుకు అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా తాము తీవ్రంగా వ్యతిరేకించామని పేర్కొంది. అయితే, బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన దేశం వదిలి పారిపోయే ప్రమాదం ఏమీ లేదని వివరించింది. అదే విధంగా ఈ కేసులో సాక్షులకూ తాము రక్షణ కల్పిస్తున్నామని తెలిపింది. కేసులో ఆధారాలను తారుమారు చేసే ముప్పు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.

ఫిబ్రవరిలో అలహాబాద్ హైకోర్టు.. అశిశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. రైతులపై కాల్పులు జరిపిన ఘటన గురించి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటుపై హైకోర్టు అనేక ప్రశ్నలు లేవదీసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో అశిశ్ మిశ్రా రైతులపై కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొన్నారని అప్పుడు హైకోర్టు గుర్తు చేసింది. అయితే, బుల్లెట్లకు సంబంధించిన గాయాలు మరణించినవారిలోనూ కనిపించలేదని, ఇతరులు ఎవరూ ఆ సందర్భంలో బుల్లెట్లతో గాయపడలేదని వివరించింది.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గతేడాది అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతులు నిరస‌న తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రికి చెందిన వాహ‌నాల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో ఇద్దరు బీజేపీ నాయ‌కులు, ఓ డ్రైవ‌ర్ చ‌నిపోయారు.

ఈ హింసాకాండ ఘ‌ట‌న‌లో అశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ బెయిల్ ను స‌వాలు చేస్తూ గ‌త నెల 21వ తేదీన బాధితుల బంధువులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ముద్దాయి చేసిన దారుణమైన నేరాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదించారు. చార్జిషీటులోని నిందితుడిపై ఉన్న బలమైన ఆధారాలు, ఆయన హోదా, పొజిషన్ వంటివి తమకు ఆందోళనకరంగా ఉన్నాయని పిటిషన్‌లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి. ఆయన న్యాయ వ్యవస్థ నుంచి పారిపోయే ప్రమాదం ఉన్నదని, న్యాయాన్ని అడ్డుకోవడం, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరోపించారు. ఇదే కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప‌లు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యుల‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త కల్పించాల‌ని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios