Lucknow: ఉత్తరప్రదేశ్ లోని రోడ్లపై మతపరమైన వేడుకలు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ ప్రసాద్, డీజీపీ ఆర్కే విశ్వకర్మ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
Ban On Religious Celebrations On Roads: రాబోయే ఈద్, అక్షయ్ తృతీయ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రంలో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. రహదారులు, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించి ఎటువంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆదేశించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ ప్రసాద్, డీజీపీ ఆర్కే విశ్వకర్మ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. మతపరమైన ప్రదేశాల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలనీ, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని డీజీపీ విశ్వకర్మ ఆదేశించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధార్మిక కార్యక్రమాలు, పూజలు తదితరాలు జరిగేలా చూడాలని క్షేత్రస్థాయిలో నియమితులైన సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేడుకలు జరపాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారులు, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపులు, ఇతర ఊరేగింపులు చేపట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంప్రదాయబద్ధమైన మతపరమైన ఊరేగింపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనవసర అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే ప్రయత్నాలపై వెంటనే స్పందించేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు సూచించారు. వదంతులు/ఫేక్ వార్తలను ప్రచురించే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ, అప్రమత్తంగా ఉండాలన్నారు.
'రాష్ట్రంలోని ప్రతి పౌరుడి భద్రత మనందరి ప్రాథమిక బాధ్యత. రంజాన్ మాసం నడుస్తోంది. ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్, అక్షయ తృతీయ, పరశురామ జయంతి ఒకే రోజున జరుపుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది' అని ప్రసాద్ పేర్కొన్నారు. 'దుర్మార్గమైన ప్రకటనలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించండి. రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి' అని పేర్కొన్నారు. రాబోయే పండుగల ఏర్పాట్ల వివరాలను డీజీపీ విశ్వకర్మ అన్ని జోన్/రేంజ్/జిల్లా స్థాయి అధికారుల నుంచి తీసుకున్నారు. పోలీసు బలగాలు నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలనీ, సీనియర్ అధికారులు కూడా ఇందులో పాల్గొనాలని ఆదేశించారు.
