ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భద్రత ఎలా వుంటుందంటే..
2025 మహాకుంభ్‌లో 50 కోట్లకు పైగా భక్తుల భద్రత కోసం యోగి సర్కార్ ప్రత్యేక ప్లాన్ రూపొందించింది. ఎస్డీఆర్ఎఫ్, పిఏసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధునిక పరికరాలతో గంగా, యమునా, సంగమంలో మోహరిస్తారు.
ప్రయాగ్‌రాజ్ : 12 ఏళ్ళ తర్వాత జరుగుతున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు భక్తులు భారీసంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యోగి సర్కార్ భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సంగమంలో పుణ్యస్నానానికి వచ్చే ఏఒక్క భక్తుడికీ ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఉండేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ప్రాంతీయ సాయుధ కాన్స్టాబులరీ (పిఏసి), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)లు కలిసి ఖచ్చితమైన ప్రణాళికతో పనిచేస్తున్నాయి. ఈ ఏజెన్సీలకు చెందిన శిక్షణ పొందిన సిబ్బంది ఆధునిక పరికరాలతో గంగా, యమునా, సంగమం ఘాట్లలో మోహరిస్తారు.
ఈసారి మహా కుంభమేళాకు 50 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. ముఖ్యమైన తిథులతో పాటు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులందరికీ నీటిలో భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ భద్రతా ఏర్పాట్లపై యూపీ ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ... మహా కుంభమేళా సమయంలో భక్తుల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఎక్కడ, ఎన్ని బెటాలియన్లు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తారనే దానిపై చర్చిస్తున్నామని చెప్పారు. ఘాట్లలో, నదీ తీరంలో సిబ్బందిని మోహరిస్తామని తెలిపారు.
ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన మరో అధికారి మాట్లాడుతూ... సిబ్బందికి అండర్ వాటర్ కెమెరాలు, డ్రోన్లు, స్పీడ్ బోట్లు, రెస్క్యూ బోట్లు, స్కూటర్ బోట్లు, అంబులెన్స్ బోట్లు, డ్రాగన్ లైట్లు అందిస్తామని, సోనార్ సిస్టమ్‌ను ఉపయోగిస్తామని, ఫ్లోటింగ్ జెట్టీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఘాట్ వద్ద రెస్క్యూ ట్యూబ్‌లు, థ్రో బ్యాగ్‌లతో సిబ్బంది ఉంటారని తెలిపారు.
శిక్షణ పొందిన డైవర్లు కూడా చేరుకోలేని ప్రదేశాలకు వాటర్ డ్రోన్లు చేరుకుంటాయని అధికారి చెప్పారు. పడవల్లో సంగమంలో ప్రయాణించే భక్తులు లైఫ్ సేవింగ్ జాకెట్లు ధరించడం ఇప్పటి నుంచే తప్పనిసరి చేశారు. నీటిపై తేలియాడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. అందులో క్విక్ రెస్క్యూ బృందాలు 24 గంటలు పనిచేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేందుకు ఫ్లోటింగ్ స్టేషన్లలో అవసరమైన వనరులు అందుబాటులో ఉంటాయి. స్నాన ఘాట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వాటి విస్తరణను దృష్టిలో ఉంచుకుని డీప్ వాటర్ బారికేడింగ్ ఏర్పాటు చేస్తారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసు, ప్రభుత్వ యంత్రాంగానికి భక్తుల భద్రతపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 'సురక్షిత మహాకుంభ్' లక్ష్యంగా యోగి సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. దీనివల్ల కుంభమేళాకు వచ్చే భక్తులు మంచి అనుభవంతో ఇళ్లకు తిరిగి వెళ్తారు.