హర్యానా అసెంబ్లీలో బిజెపి అనూహ్య విజయం...యూపీ సీఎం యోగి రియాక్షన్ ఏంటో తెలుసా?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి మరింత జోష్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
లక్నో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన హర్యానా బిజెపికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అభినందనలు తెలిపారు. ఇలా హర్యానా విజయంపై సోషల్ మీడియా వేదికన ఆనందం వ్యక్తం చేసారు యోగి. ఇది బిజెపి కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాదు ఓటర్లు సాధించిన విజయమని యోగి అన్నారు.
'వికసిత హర్యానా-వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజయం దోహదపడుతుందని... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ విధానాలకు ఇది మరో నిదర్శనమని అన్నారు. అలాగే హర్యానా ముఖ్యమంత్రుల సమర్థ నాయకత్వంపై, డబుల్ ఇంజన్ సర్కార్ పై హర్యానా ప్రజలు మరోసారి విశ్వాసం వుంచారని అన్నారు.
సీఎం యోగి అభినందనలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024లో బిజెపి సాధించిన చారిత్రాత్మక విజయంపై అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, గౌరవనీయులైన ఓటర్లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జాతీయ భావనతో ముందుకు సాగుతున్న బిజెపికి మళ్లీ సేవ చేసే అవకాశం కల్పించిన హర్యానా ప్రజలందరికీ సీఎం యోగి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.