భారీ వర్షాలు, వరదల ధాటి నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నకేరళకు మరో పిడుగు లాంటి వార్త పేల్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 


కొచ్చి: భారీ వర్షాలు, వరదల ధాటి నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నకేరళకు మరో పిడుగు లాంటి వార్త పేల్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ సూచనల మేరకు పథానంతిట్ట, ఇడుక్కి, వాయానంద్‌ జిల్లాల్లో మంగళవారం, పాలక్కాడ్‌, ఇడుక్కి, త్రిస్సూర్‌, వాయానంద్‌ జిల్లాలకు బుధవారం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

మంగళ, బుధ వారాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ 64.4మిల్లీమీటర్ల నుంచి 124.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతో గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. అంతేకాదు వర్షసూచనకు సంబంధించిన ఈ సమాచారాన్ని కేరళ సీఎం కార్యాయలయం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆగస్టు నెలలో కేరళ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయ్యింది. శతాబ్ధకాలంలో ఎప్పుడు లేనంతగా వరదలు రావడంతో కేరళ చిగురుటాకులా వణికిపోయింది. వరదల ధాటికి 400 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది.