బెంగుళూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం యడియూరప్ప మండిపడ్డారు.కర్ణాటకలోని బెళగావితో సహా ఇతర ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నాడు ప్రకటించారు.ఈ వ్యాఖ్యలకు కర్ణాటక సీఎం యడియూరప్ప కౌంటరిచ్చారు.

మహారాష్ట్ర సీఎం ప్రకటనను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఈ ప్రకటన చాలా దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదులుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.

సరిహాద్దు అంశంపై మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలు అనుచితమన్నారు. ఈ వ్యాఖ్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్దమని ఆయన చెప్పారు.కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు సోదరభావంతో కలిసి మెలిసి జీవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఠాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.నిజమైన భారతీయుడిగా ఫెడరల్ స్పూర్తికి , విధానాలకు ఠాక్రే గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు యడియూరప్ప ట్విట్టర్ వేదికగా  మహారాష్ట్ర సీఎం ఠాక్రేకు కౌంటరిచ్చారు.

 

గతంలో బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి ఇతర ప్రాంతాలు మైసూరు రాష్ట్రంలో కలిశాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా మరాఠీని మాట్లాడుతారు. దీంతో  ఈ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని మహారాష్ట్ర కోరుతోంది.

1956 జనవరి 17న ఈ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా ఆ సమయంలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన చేసింది. ఈ ఆందోళనల్లో 10 మంది మరణించారు. ప్రతి ఏటా జనవరి 17న అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు.దీన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సోమవారం నాడు యడియూరప్ప కౌంటరిచ్చారు.