హరిద్వార్‌లోని ఓ సదస్సులో ఇచ్చిన విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు రెండో నిందితుడిని అరెస్టు చేశారు. వాసిం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన అరెస్టును నిరసిస్తూ మరో నిందితుడు యతి నర్సింగానంద్ హరిద్వార్‌లో ధర్నాకు దిగారు. తాజాగా, శనివారం యతి నర్సింగానంద్‌ను కూడా ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తీసుకున్న చర్యలపై పది రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఈ అరెస్టు జరుగుతుండటం గమనార్హం.
హరిద్వార్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని హరిద్వార్(Haridwar)లో గతేడాది నిర్వహించిన మతపరమైన సదస్సులో విద్వేష పూరిత ప్రసంగా(Hate Speech)లకు సంబంధించి కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు యతి నర్సింగానంద్(Yati Narsinghanand)ను అరెస్టు(Arrest) చేశారు. ఈ కేసులో ఇది వరకే వాసిం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ యతి నర్సింగానంద్ ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు కూర్చున్న యతి నర్సింగానంద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి తీసుకెళ్లారు. విద్వేషపూరిత ప్రసంగాల కేసులో ఇది రెండో అరెస్టు.
గతనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హరిద్వార్‌లో కొందరు సాధువులు ఓ సదస్సు నిర్వహించారు. ఇందులో చాలా మంది ప్రసంగిస్తూ ముస్లింల మారణహోమానికి పాల్పడాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ముస్లిం వ్యక్తిని ప్రధాని కానివ్వరాదని, వారి జనాభా పెరగకుండా చూడాలని, వారిని సంహరించడానికి హిందు బ్రిగేడ్లు మెరుగైన ఆయుధాలు వాడాలని రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేశారు. ఈ సదస్సులో వారి ప్రసంగాలకు చెందిన కొన్ని క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మిలిటరీ చీఫ్‌లు, రిటైర్డ్ న్యాయమూర్తులు, కార్యకర్తలు, అంతర్జాతీయ ప్రముఖులూ స్పందించి ఖండించారు. ఈ సదస్సులోని విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యతి నర్సింగానంద్‌తోపాటు మరో 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ సదస్సు జరిగి నెల రోజులు గడిచిన తర్వాత తొలి అరెస్టు జరిగింది.
ఈ సదస్సుపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఈ కేసులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పది రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల తర్వాతే తొలి అరెస్టు జరిగింది. తర్వాతి రోజే యతి నర్సింగానంద్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్లిప్‌లు వైరల్ అయిన తర్వాత విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై తీవ్ర నిరసన వెలువడింది. వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యతి నర్సింగానంద్.. ఓ పోలీసు అధికారితో సన్నిహితంగా మెదులుతున్న వీడియో చర్చనీయాంశం అయిది. పోలీసులూ తమ వైపే ఉంటారని ఆయన బిగ్గరగా నవ్వుతున్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత తొలి అరెస్టు జరగ్గానే మీరంతా ఛస్తారు అంటూ గురువారం ఆయన పోలీసులపై దూషణలకు దిగారు.
కాగా, హరిద్వార్‌లో ఆ సదస్సు నిర్వహించిన వారిలో మాత్రం ఎలాంటి పశ్చత్తాపం కనిపించలేదు. అంతేకాదు, తాము ఏమీ తప్పు చేయలేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈ సదస్సులో మాట్లాడిన ప్రభోదానంద్ గిరి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను మాట్లాడిన దానికి సిగ్గు పడటం లేదని అన్నారు. తాను పోలీసులకు భయపడనని, తన మాటలకు కట్టుబడి ఉన్నారని వివరించారు. ఈయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ దామిలతోనూ పలు ఫొటోల్లో కనిపించారు.
