విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. 

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. మరి యశ్వంత్ సిన్హా జీవితంలోని మలుపును చూస్తే.. ఆయన గతంలో ఐఏఎస్ అధికారిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1973 నవంబర్ 6న జన్మించిన యశ్వంత్ సిన్హా.. బిహార్‌లోని పాట్నాలో స్కూలింగ్ పూర్తిచేశారు. అక్కడే యూనివర్సిటీ‌లో చదువును కొనసాగించారు. 1958లో ఆయన పాట్నా విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో తన మాస్టర్స్ పూర్తి చేసారు. 1958 నుంచి 1960 వరకు పొలిటికల్ సైన్స్ బోధించాడు. 1960లో ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరారు. 24 సంవత్సరాల సుధీర్ఘకాలం పాటు ఐఏఎస్‌ అధికారిగా పనిచేశారు. యశ్వంత్ సిన్హా ఐఏఎస్‌గా పదవీకాలంలో అనేక హోదాల్లో విధులు నిర్వహించారు.

1984లో ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా.. జనతా పార్టీ‌లో చేరడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1986లో ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1988లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వీపీ సింగ్ నాయకత్వంలో జనతాదళ్ ఏర్పడినప్పుడు.. యశ్వంత్ సిన్హా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జనతాదళ్‌ను విభజించి సమాజ్‌వాదీ జనతా పార్టీని స్థాపించిన చంద్ర శేఖర్ మంత్రివర్గంలో 1990 నవంబర్ నుంచి 1991 జూన్ వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

1993లో విలేకరుల సమావేశంలో యశ్వంత్ సిన్హా బీజేపీలో చేరినట్టుగా ప్రకటించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ.. ఆ పరిణామాన్ని పార్టీకి దీపావళి కానుకగా అభివర్ణించారు. ఇక, 1998, 1999, 2009లలో జార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. యశ్వంత్ సిన్హా క్రమంగా బీజేపీకి దూరం అవుతూ వచ్చారు. ఇక, 2014లో హజారీబాగ్ నుంచి ఆయనకు టికెట్ నిరాకరించిన బీజేపీ.. ఆయన పెద్ద కుమారుడు జయంత్‌ను అక్కడి నుంచి పోటీకి దింపింది. 

2018లో పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. కానీ గతేడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండి.. విస్తృత జాతీయ ప్రయోజనాల కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ఇక, యశ్వంత్ సిన్హా ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆయన నీలిమను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.