Presidential Election 2022: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ల‌ను ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోరారు. అలాగే.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కూడా సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది.  

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో అభ్య‌ర్థుల‌ను దించారు. విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ను బ‌రిలో నిలుప‌గా.. అధికార బీజేపీ (ఏన్డీఏ కూట‌మి) జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌తి ముర్మును బ‌రిలో దించింది.

వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన సిన్హా .. ఒకప్పటి తన సొంత పార్టీపై ఇప్పుడు పోటీకి సై అంటున్నాడు. ఈ క్ర‌మంలో యశ్వంత్ సిన్హా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల‌కు ఫోన్ చేసి.. అధ్య‌క్ష‌ఎన్నికల్లో తన‌కు మద్దతు ఇవ్వాల‌ని కోరారు. అలాగే.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కూడా ఫోన్ ద్వారా సంప్ర‌దించి.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) వర్గాలు మాట్లాడుతూ.. "మేము మా ప్రచారాన్ని ప్రారంభించాం, ఎన్నికల్లో మద్దతు కోరడానికి ప్రతి ఒక్కరినీ చేరుకుంటాం. ప్ర‌ధాని మోదీ, సింగ్‌ల కార్యాలయాలకు ఫోన్ చేసి తన అభ్యర్థికి మద్దతు కోరుతామ‌ని తెలిపాయి.

అలాగే.. మాజీ కేంద్ర మంత్రి, తన గురువు, సీనియర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎల్‌కె అద్వానీని కూడా సిన్హా సంప్రదించారు. సోమవారం మధ్యాహ్నం ప్రతిపక్ష అగ్రనేతల సమక్షంలో సిన్హా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. శుక్రవారం తన సొంత రాష్ట్రం జార్ఖండ్ నుండి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని భావించిన సిన్హా.. ముర్ముకు సోరెన్ అనుకూలంగా మొగ్గు చూపుతున్నట్లు తేలడంతో.. ప్ర‌చారాన్ని ఆలస్యం చేయవలసి వచ్చింది.

విపక్ష నేతలందరికీ సిన్హా లేఖ 

కాగా, జూలై 18న జరగనున్న అధ్యక్ష‌ ఎన్నికల్లో త‌న‌ను ప్ర‌తిప‌క్ష‌ పార్టీల‌ అభ్యర్థిగా ఎంపిక చేసిన విపక్ష నేతలందరికీ సిన్హా లేఖ రాశారు. ఈ సంద‌ర్బంగా సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి పక్షపాతం లేకుండా రాష్ట్ర‌ప‌తిగా ఎన్నుకోబడితే.. భారత రాజ్యాంగ ప్రధాన విలువలు, మార్గదర్శక ఆదర్శాలను కాపాడుతాన‌నీ, రాజ్యాంగ బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని భారత ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల రాజధానులను సందర్శించి ప్రచారాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. 

ముర్ముకు జేఎంఎం మద్దతు 

ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జెఎంఎం, జనతాదళ్ (సెక్యులర్) శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్ర‌క‌టించాయి.