ఓ కేసు విషయంలో విచారణకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.... యమునా ఎక్స్‌ప్రెస్ వే పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు సంబంధించి 2014లో వెలుగు చూసిన రూ.126 కోట్ల భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసు విచారణను చేపట్టిన ఘజియాబాద్‌కు చెందిన సీబీఐ ఇన్స్‌పెక్టర్ వీఎస్ రాథోడ్, ఏఎస్ఐ సునీల్ దత్‌లపైనే అనంతరం నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

దీంతో అధికారులలో ఒకరైన రాథోడ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దత్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అతనిని అదుపులోకి తీసుకునేందుకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు అధికారులతో కూడిన ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం దత్ స్వగ్రామం సోన్‌పురాకు వెళ్లింది.

ఆ దశలో దత్‌ను తప్పించేందుకు అతని బంధువులంతా సీబీఐ అధికారులపై దాడికి దిగారు. కర్రలతోనూ, చేతులతోనూ కొడుతూ తరిమారు. కొందరి సెల్‌ఫోన్లు, గుర్తింపు కార్డులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.