ఓ నకిలీ డాక్టర్ నిర్వాకం వల్ల ఓ 13ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు తప్పుడు మందులు ఇవ్వడంతో... చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీ నగరంలోని సంజయ్ కాలనీలో వెలుగుచూసింది. సంజయ్ కాలనీకి చెందిన బచ్చు పాశ్వాన్ అనారోగ్యంతో బాధపడుతున్న తన 13 ఏళ్ల కుమార్తెను చికిత్స కోసం బన్సీలాల్ అనే డాక్టరు క్లినిక్ వద్దకు తీసుకువచ్చాడు. నకిలీ డాక్టరు అయిన బన్సీలాల్ బాలికకు తప్పుడు మందులతోపాటు ఇంజక్షన్ ఇచ్చాడు. 

దీంతో బాలిక మరణించింది. మృత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు నకిలీ డాక్టరు అయిన బన్సీలాల్ ను అరెస్టు చేసి అతనిపై ఐపీసీ సెక్షన్ 304, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ డాక్టరును కోర్టులో హాజరు పర్చి జైలుకు తరలించామని పోలీసులు చెప్పారు.