Asianet News TeluguAsianet News Telugu

కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. చర్చలకు పిలిచిన కేంద్రం.. అనురాగ్ ఠాకూర్ ట్వీట్..

లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.

Wrestlers protest government Willing to have a discussion says Anurag Thakur ksm
Author
First Published Jun 7, 2023, 10:08 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం వారిని చర్చలకు పిలిచింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో ‘‘చర్చ’’కు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ‘‘రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం నేను మరోసారి రెజ్లర్లను ఆహ్వానించాను’’ అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన అధికారిక నివాసంలో నిరసన తెలుపుతున్న రెజ్లర్ల ప్రతినిధి బృందం కలిసిన నాలుగు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా, వినేష్ ఫొగాట్ రైల్వేలో వారి ఉద్యోగాలకు హాజరుకావడంతో పలు వదంతులు వ్యాప్తి చెందాయి. అయితే రెజ్లర్లు మాత్రం తాము ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చర్చల కోసం కేంద్రం నుంచి పిలుపు రావడంపై రెజ్లర్లు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇదివరకే బ్రిజ్ భూషణ్‌‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక, మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే వారు గతకొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి పతకాలను గంగా నదిలో వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసహరించుకుని ప్రభుత్వానికి ఐదు రోజుల డెడ్ లైన్ విధించారు. 

ఈ క్రమంలోనే శనివారం రాత్రి 11 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో రెజ్లర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. చట్టం తన పని తాను చేస్తుందని ఆయన రెజ్లర్లతో చెప్పినట్లు నివేదికలు వెలువడ్డాయి. 

ఈ క్రమంలోనే అమిత్ షాను కలిసిన రెజ్లర్లు డీల్ కుదుర్చుకున్నారని.. ఇక నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చారనే పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లను రెజ్లర్లు ఖండించారు. అమిత్ షాతో సమావేశం గురించి చర్చించవద్దని ప్రభుత్వం తమను కోరిందని చెప్పారు. అయితే తామే మీడియాకు సమాచారాన్ని లీక్ చేశామని చెప్పారు. హోం మంత్రితో తమకు ఎలాంటి ‘‘సెట్టింగ్’’ లేదని బజరంగ్ పునియా చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని షా తమకు చెప్పారని తెలిపారు. తమ నిరసన ఉద్యమం ఆగిపోలేదని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios