అది దేశానికి చీకటి రోజు.. మేం రోడ్లపై, నిందితుడు పార్లమెంటులో.. : రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన వ్యాఖ్యలు
రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి అనుమతించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. రెండు మూడు రోజుల్లో నిరసన కార్యచరణను వెల్లడిస్తామని వివరించారు. పార్లమెంటు ప్రారంభోత్సవం నాడు తమ అరెస్టుల గురించి పేర్కొంటూ.. అది దేశానికి చీకటి రోజు అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఒలింపియన్ రెజ్లర్ బజరంగ్ పునియా ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. శనివారం రాత్రి 11 గంటలకు నిరసనలు చేస్తున్న రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. సుమారు గంటపాటు వాళ్లు భేటీ అయ్యారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఐదు రోజుల డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణ ఏమిటన్న విషయాలనూ బజరంగ్ పునియా వివరించారు.
అమిత్ షాతో సమావేశం గురించి బయట ఎక్కడా మాట్లాడరాదని తమకు ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చాయని బజరంగ్ పునియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, ఆ విషయాలు మీడియాలో వచ్చాయని, తమను మాట్లాడరాదని చెప్పి.. వారే మీడియాకు లీక్ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే, అమిత్ షా, తమకు ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని, తమ డిమాండ్లను ఆయన అంగీకరించలేదని, ఆయన నుంచి తమకు కావాల్సిన సమాధానమూ రాలేదని తెలిపారు.
నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం రోజున మీరు నిరసనలు చేయడం.. అనుమతులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘించారనే వాదనలు ఉన్నాయని ప్రస్తావించగా.. బజరంగ్ పునియా ఇలా బదులిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి కూడా తమకు పర్మిషన్ ఇవ్వలేదని, రోడ్లపై ప్రత్యేకంగా ఎలా పర్మిషన్ ఉంటుందని అన్నారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం గురించే దేశవ్యాప్తంగా చర్చ ఉన్నది వాస్తవమేనని పేర్కొంటూ ఓ కీలక వ్యాఖ్య చేశారు. జాతీయ జెండాను ప్రపంచ యవనికపై రెపరెపలాడించిన క్రీడాకారులు, ఆడపిల్లలు రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. పోలీసులు వారిని అడ్డుకున్నారని అన్నారు. వారితోపాటు జాతీయ జెండాను కూడా నేలపై వేసిన చిత్రాలు చూశామని వివరించారు. కానీ, ఆ ఆడపిల్లలు లైంగిక ఆరోపణలు చేసి వ్యక్తి మాత్రం నూతన పార్లమెంటు ప్రారంభోత్సవంలో ఉన్నారని తెలిపారు. తనకు తెలిసి అది దేశానికి చీకటి రోజు అని చెప్పారు. అది దేశానికి దుర్దినం అని అన్నారు.
Also Read: అర్థరాత్రి వరకు అమిత్ షాతో రెజ్లర్ల భేటీ.. అర్ధంతరంగా బయటకు వచ్చేసిన రెజ్లర్లు ఏమన్నారంటే?
నిరసనలు విరమించకుంటే రైల్వే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఎమైనా ఒత్తిళ్లు వచ్చాయా? అని అడగ్గా రాలేవని సమాధానం చెప్పారు. అయితే, నిరసనల కోసం తాము తీసుకున్న సెలవులు అయిపోయాయని, అందుకే ఉద్యోగాల్లో చేరి మళ్లీ నిరసనకు వస్తామని తెలిపారు.
రెండు మూడు రోజుల్లో నిరసన కార్యచరణను వెల్లడిస్తామని, ఇప్పుడు ఈ ఆందోళనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే దానిపై వ్యూహరచన చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ, జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీ గేట్ వద్ద ధర్నా చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించడం లేదు కదా? అని అడగ్గా.. జంతర్ మంతర్ ఉన్నదే నిరసనలకు అని అన్నారు. తాము అక్కడ నిరసన చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఒక వేళ అనుమతి విషయానికి వస్తే.. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని వివరించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతుల కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన ఒలింపిక్ మెడల్స్, ఇతర గోల్డ్ మెడల్స్ నదిలో వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని, దాని చుట్టూ అనేక వాదనలు నడిచాయని రిపోర్టర్ పేర్కొన్నారు. మెడల్స్ మాత్రమే కాదు.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, ఇతర ఆస్తులనూ తిరిగి ఇచ్చేయాలనే కామెంట్లు వచ్చాయని ప్రస్తావించగా.. ఈ దేశం వేలాది మంది ఎంపీలు అయ్యారని, కానీ, దేశంలో కేవలం 21 ఇండివిడ్యువల్ ఒలింపిక్ మెడల్స్ ఉన్నాయని బజరంగ్ పునియా చెప్పారు. మన దేశంలో ఒలింపిక్ మెడల్స్‌కు ఉన్న విలువ ఏమిటో తెలియదని అన్నారు.