తమిళనాడులో దారుణం జరిగింది. 13 అడుగుల లోతు కందకం కూలి ఓ వర్కర్ సజీవ సమాధి అయ్యాడు. ఆయనను రక్షించడానికి జేసీబీ ద్వారా ప్రయత్నించారు. కానీ, ఆ జేసీబీ ఏకంగా వర్కర్ తలనే బయటకు తెచ్చింది. వర్కర్‌ను కాపాడబోయి ప్రాణాలే తీశారు.
చెన్నై: పుణ్యం చేయబోతే పాపం ఎదురైందటా.. 13 అడుగుల లోతు కందకం కూలి వర్కర్ సజీవ సమాధి అయ్యాడు. వెంటనే అక్కడే పని చేస్తున్న జేసీబీ సమీపంగా వచ్చింది. కూలిన కందకంలో నుంచి మట్టిని తొలగించి ఆ వర్కర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. తొలిసారి భారీగా మట్టి తీశారు. రెండోసారి జేసీబీతో ప్రయత్నించగా.. దారుణం జరిగింది. కందకంలో కూరుకుపోయిన వర్కర్ తల బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారి గుండె గొంతులోకి వచ్చింది. జరిగిన పరిణామాన్ని చూసి భయంతో వర్కర్లు పరుగులు పెట్టారు. ఈ ఘటన తమిళనాడులో మదురైలోని రామమూర్తి నగర్‌లో చోటుచేసుకుంది.
ఎరోడ్‌కు చెందిన 34 ఏళ్ల ఆర్ సతీష్ అనే కార్మికుడు మదురై మున్సిపల్ కార్పొరేషన్ పనులకు కూలీగా వచ్చాడు. బీటీ రణదివె మెయిన్ రోడ్ సమీపంలో డ్రైనేజీ పైప్‌లైన్ వేస్తున్నారు. ఇందుకోసం 13 అడుగుల లోతైన కందకాన్ని తవ్వారు. ఇరుకుగా వెడల్పు తక్కువగా ఉన్న కందకం. సతీష్ అనే కార్మికుడు పైపులు వేసే పనిలో భాగంగా కందకంలోకి దిగాడు. కానీ, అక్కడ మట్టి లూజ్‌గా ఉన్నది. ఆయన దిగీ దిగగానే ఆ కందకం కూలిపోయింది. దీంతో సతీష్ ఆ కందకంలోనే సజీవంగా సమాధి అయ్యాడు.
దీంతో మిగతా వర్కర్లు సహాయం కోసం అధికారులను ఆశ్రయించలేదు. స్థానికులనూ పిలువ లేదు. తమకు అందుబాటులో ఉన్న వనరులతో సతీష్‌ను కాపాడుకోవచ్చు అని తలిచారు. వెంటనే అక్కడే ఉన్న జేసీబీ పరుగున స్పాట్‌కు వచ్చింది. సతీష్‌ను ఆ కందకం నుంచి బయటకు తీయడానికి ఆయనపై కూలిపడిన మట్టిని తొలగించే ప్రయత్నం చేసింది. కానీ, కాపాడబోయే ప్రయత్నమే ప్రాణాలు తీస్తుందని ఎవరికి తెలుసు.
ఆ జేసీబీ రెండోసారి మట్టిని తవ్వడానికి కందకంలోకి వెళ్లి రాగానే.. సతీష్ మరణించాడు. ఆ వర్కర్ తల జేసీబీతో పాటు బయటకు వచ్చింది. దీంతో అక్కడున్నవారంతా ఖంగారు పడ్డారు. సతీష్ తల అంత ఎత్తులోనే ఉంటుందని జేసీబీ ఆపరేటర్ ఊహించలేదని స్థానిక నివాసి ప్రగలనాథన్ వివరించారు. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వస్తాయనే భయంతో ఆ వర్కర్లు స్పాట్ నుంచి పరుగులు తీశారు.
సతీష్‌ను జేసీబీతో కాకుండా కూలీలతో తవ్వించి ఉంటే సతీష్‌ను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉండేవని స్థానికులు వివరించారు. కాగా, సైట్‌కు కార్పొరేషన్ కమిషనర్ సిమ్రన్ జిత్ సింగ్ కహ్లాన్, డిప్యూటీ మేయర్ టీ నాగరాజన్‌లు వెళ్లారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
