కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి... కాంగ్రెస్ పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను 14నెలలు కాంగ్రెస్ కి బానిసలా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టాయి. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన దాదాపు 14మంది ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారడంతో... కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. దీంతో... బీజేపీ అధికారం చేపట్టింది.

కాగా... దీనిపై తాజాగా కుమారస్వామి స్పందించారు. కార్పొరేషన్ చైర్మన్లతో సహా ఎమ్మెల్యేందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్పారు. ఈ ఎమ్మెల్యేలు, కూటమి భాగస్వామి (కాంగ్రెస్) కోసం 14 నెలల పాటు 'ఊడిగం' చేశానని, ఇంత చేసినా తనపై ఎందుకు నిందారోపణలు చేస్తున్నారో తెలియదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేసారు.
 
తొలుత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురు కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని, అయితే మిశ్రమ తీర్పు రావడంతో కాంగ్రెస్సే జేడీఎస్‌తో చేతులు కలిపేందుకు ఐచ్ఛికంగా ముందుకు వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుందని కుమారస్వామి చెప్పారు. అయితే కొందరు స్థానిక నేతలకు ఇది ఇష్టంలేదని కొందరు తనతో చెప్పినట్టు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి కాంగ్రెస్ నుంచి ఓ వర్గం నేతలు తనను వ్యతిరేకిస్తూనే ఉన్నారని ఆ విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల కంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజచకవర్గాలకే తమ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు సైతం అపాయింట్‌మెంట్ లేకుండానే తనను కలిసేవారని, తమ నియోజకవర్గాలకు ఫలానా పని చేయమని అడిగిన వెంటనే నిర్ణయాలు తీసుకునేవాడినని, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాని కంటే 14 నెలలో తాను ఎంతో చేశానని చెప్పారు. కాంగ్రెస్ తో చేతులు కలపడం తమ పార్టీ నేతలు కొందరికి ఇష్టం లేకున్నా... తాను చేశానని ఈ సందర్భంగా ఆయన వివరించారు.