మహిళా రిజర్వేషన్ బిల్లు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది - ప్రధాని నరేంద్ర మోడీ
లోక్ సభ బుధవారం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత పార్లమెంటరీ ప్రయాణంలో బుధవారం సువర్ణ ఘట్టం చోటు చేసుకుందని చెప్పారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్ సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మహిళల్లో ఏర్పడే విశ్వాసం అపూర్వ శక్తిగా ఎదుగుతుందని, ఇది దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారని ప్రధాని అన్నారు. బుధవారం భారత పార్లమెంటరీ ప్రయాణంలో సువర్ణ ఘట్టం చోటు చేసుకుందని చెప్పారు. ఈ సభలోని సభ్యులందరూ ఆ సువర్ణ ఘట్టానికి అర్హులని పేర్కొన్నారు. ‘‘నిన్న తీసుకున్న నిర్ణయం, నేడు రాజ్యసభ బిల్లును ఆమోదించిన తర్వాత చివరి మైలు దాటినప్పుడు దేశంలోని మహిళల ముఖాల్లో మార్పు, ఏర్పడే విశ్వాసం ఊహించలేని, అపూర్వమైన శక్తిగా ఆవిర్భవించి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. నేను దీన్ని అనుభవించగలను’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ఇదిలా వుండగా.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఆర్టికల్ 330, ఆర్టికల్ 332, ఆర్టికల్ 334లో ఒక సెక్షన్ ను చేర్చనున్నారు. వీటి ద్వారా లోక్ సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో 1/3వ వంతు సీట్లు రిజర్వు అవుతాయి. ఇదొక కీలక అడుగు’’ అని ఆయన రాజ్యసభ్యలో ప్రకటించారు.
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023ను న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ బుధవారం లోక సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 454 మంది, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓటు వేశారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు తిరస్కరణకు గురికావడంతో పాటు బిల్లులోని క్లాజులపై ఓటింగ్ కూడా జరిగింది.
వాస్తవానికి 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. కానీ లోక్ సభలో చర్చకు రాకపోవడంతో అక్కడ ఆమోదం పొందలేదు. అయితే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మంగళవారం లోక్ సభలో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బుధవారం ఆమోదించింది. నేడు రాజ్యసభ ఆమోదించే అవకాశం ఉంది.