పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో సోమవారం ప్రారంభం కాగా.. ఈరోజు కొత్త భవనంలోకి సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో సోమవారం ప్రారంభం కాగా.. ఈరోజు కొత్త భవనంలోకి సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లకు 'నారీ శక్తి వందన్ అధినియం'గా నామకరణం చేశారు. ‘‘దేశ అభివృద్ధి ప్రక్రియలో ఎక్కువ మంది మహిళలు చేరాలని మేము కోరుకుంటున్నాము’’ అని ఈ బిల్లుపై ప్రసంగిస్తూ మోదీ అన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలలో విధాన రూపకల్పనలో మహిళలు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక, కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు కూడా ఇదే కావడం విశేషం.
అయితే ఈ బిల్లు అన్ని విధాలుగా ఆమోదం పొందిన రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ బిల్లు అమలు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలలో మహిళలకు సీట్ల రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలు నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చేపట్టిన తర్వాతే అమల్లోకి వస్తాయని బిల్లు పేర్కొంది. అలాగే ఈ బిల్లు 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ‘‘రాజ్యాంగం (128వ సవరణ) చట్టం, 2023 ప్రారంభమైన తర్వాత తీసుకున్న మొదటి జనాభా లెక్కల సంబంధిత గణాంకాలు ప్రచురించబడిన తర్వాత ఈ ప్రయోజనం కోసం నియోజకవర్గాల కసరత్తు చేపట్టబడుతుంది’’ అని బిల్లులో పేర్కొన్నారు. అయితే 2026లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.
మహిళా రిజర్వేషన్ బిల్లులోని కీలక అంశాలు ఇవే:
-ఈ బిల్లు లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను మంజూరు చేస్తుంది. అయితే రాజ్యసభ, శాసనమండలిని మినహాయిస్తుంది.
-మొదటి జనాభా గణనకు సంబంధించిన గణాంకాలు ప్రచురించబడిన తర్వాత డీలిమిటేషన్ చేపట్టిన తర్వాత సీట్ల రిజర్వేషన్ అమలులోకి వస్తుంది.
-లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు రిజర్వు చేయబడిన సీట్ల భ్రమణం ప్రతి తదుపరి డీలిమిటేషన్ వ్యాయామం తర్వాత జరుగుతుంది.
-షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది.
-ఒక స్థానంలో ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ చేసేందుకు అనుమతించరు.
-బిల్లు ఓబీసీ కేటగిరీ నుంచి మహిళలకు రిజర్వేషన్లను మినహాయించింది.
ఇక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విధాన రూపకల్పనలో మహిళలు ఎక్కువగా భాగస్వామ్యమయ్యేలా ఈ బిల్లును ఉద్దేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపాదిత బిల్లు దాదాపు 27 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. చివరగా 2010లో రాజ్యసభలో ఆమోదించబడింది.
