ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం తీసుకున్న కేసులో ఒక మహిళా ఎస్సై కటకటాలపాలయ్యింది. గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన బయటకు రావడంతో... ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన ఒక నిందితుడిని తప్పియ్యడానికి మరో మహిళే పూనుకోవడంతో సర్వత్రా విచారం  వ్యక్తమవుతుంది. 

రేప్ కేసు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అహ్మదాబాద్ వెస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శ్వేతా జడేజా రూ. 35 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అహ్మదాబాద్‌లో షా క్రాప్ సొల్యూషన్స్ కంపెనీ నిర్వహిస్తున్న కేనాల్ షా తన కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసాడని పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదులు అందాయి. దీనితో కేసు దర్యాప్తును ప్రారంభించింది అధికారి శ్వేతా జడేజా. 

2019లో నమోదైన కేసు తాలూకు విచారణ చేపడుతుండగానే కేనాల్ షా తమ్ముడు భావేశ్ కు ఫోన్ చేసి 35 లక్షల లంచం డిమాండ్ చేసింది. అతను అంత ఇచ్చుకోలేనని చెబుతూ... 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది లాక్ డౌన్ కి ముందు ఫిబ్రవరిలో 20 లక్షలు సదరు అధికారికి సమర్పించినట్టు తెలిసింది. 

ఆ తరువాత మరల కాల్ చేసి 20 లక్షలకు ఒప్పుకునేది లేదు, ముందనుకున్న 35 లక్షలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టిందట. మరో 15 లక్షలు ఇవ్వమని పలుమార్లు ఒత్తిడి చేసింది. ఈ తతంగం జరుగుతుండగానే పోలీసులు ఆమెను శుక్రవారం నాడు అరెస్ట్ చేసి శనివారం కోర్టు ముందు హాజరు పరిచారు. 7రోజుల రిమాండ్ ను పోలీసులు కోరినప్పటికీ... కోర్ట్ మాత్రం మూడు రోజుల రిమాండ్ కి అంగీకరించింది.