Asianet News TeluguAsianet News Telugu

రెస్టారెంట్‌ సిబ్బంది నిర్వాకం.. చీర కట్టుకుని వచ్చిందని మహిళకు నో ఎంట్రీ, వీడియో వైరల్

చీర విషయంలో సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో మహిళల్ని అవమానించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. చీర కట్టుకుని వచ్చిన అనితా చౌదరి అనే మహిళను ఓ రెస్టారెంట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. చీర కట్టుకుందున్న కారణంతో ఆమెను లోపలికి అనుమతించలేదు.

Women Not allowed into restaurant for wearing Saree, Video Goes Viral
Author
New Delhi, First Published Sep 23, 2021, 11:00 PM IST

చీర మనదేశ చరిత్ర… చీర మన మహిళ ఆత్మవిశ్వాసం… అంతరించిపోతోన్న చేనేతకు చీరల తయారీతో ఊపిరి పోయాలనుకుంటున్నాయి ప్రభుత్వాలు. మనదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం. ప్రతి ప్రాంతానికీ ఓ చరిత్ర ఉంటుంది. అదే గొప్పదనం చీరల్లోనూ కనిపిస్తుంది. అది భారతదేశ మహిళల జీవితంలో ఓ భాగమైపోయింది. అంతటి విశిష్టత వున్న చీర విషయంలో సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో మహిళల్ని అవమానించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. చీర కట్టుకుని వచ్చిన ఓ మహిళను ఓ రెస్టారెంట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. చీర కట్టుకుందున్న కారణంతో ఆమెను లోపలికి అనుమతించలేదు.

వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని అన్సల్ ప్లాజా అనే మాల్‌లోని రెస్టారెంట్‌కు అనితా చౌదరి అనే మహిళ వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులతోపాటు అక్కడి మహిళా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ రెస్టారెంట్ స్మార్ట్ డ్రెస్ కోడ్‌లో మీ చీర లేదని.. అందుకే లోనికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆమె రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ఆమెను మాత్రం లోపలికి అనుమతించలేదు.

ఇందుకు సంబంధించిన వివరాలను అనితా చౌదరి సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో తాను ధరించిన చీర స్మార్ట్ అవుట్ ఫిట్ కాదంట అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. నిన్న నా చీర కారణంగా జరిగిన అవమానం నాకు ఇప్పటివరకు జరిగిన ఇతర అవమానాల కంటే పెద్దది, ఇది హృదయాన్ని కలిచివేస్తోందని ఆమె క్యాప్షన్‌లో హైలెట్ చేశారు.” ఆ తర్వాత ఆమె యూట్యూబ్ లోనూ తనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేయడంతో ఇది మరింత సంచలనంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios