రోజు రోజుకీ మానవ సంబంధాలు అతి దారుణంగా తయారౌతున్నాయి. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తని... కడుపున పుట్టిన కొడుకు అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్కాడు సమీపంలోని తాజ్ పుర మందవేలి గ్రామానికి చెందిన సుబ్రమణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రిషియన్. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దీపిక(20)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్రనీష్ అనే ఏడాది వయసు కుమారుడు ఉన్నాడు.

ఈ నెల 13వ తేదీ నుంచి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని దీపిక ఆర్కాడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సెల్‌ నంబర్‌ చెబితే వెంటనే కనిపెడతామని పోలీసులు ఆమెకు తెలిపారు.

అయితే తన భర్త సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తడబడడంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారణ చేశారు. ఆ సమయంలో దీపిక తన భర్త రాజా, కుమారుడు ప్రనీష్‌లను హత్య చేసి ఇంటి సమీపంలోని భూమిలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకుంది. 

అవాక్కైన పోలీసులు గురువారం రాత్రి మృతదేహాలు పూడ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. శవాలను తర్వాతి రోజు ఉదయం బయటకు తీశారు. కాగా... వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తోనే భర్తను, కొడుకును చంపినట్లు ఆమె అంగీకరించింది. పోలీసులు దీపికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.